ఉద్యోగులు చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులివ్వడం లేదని ఉద్యోగులు.. వారి సంఘాల నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే కొంత మంది ఉద్యోగ సంఘం నేతలు మాత్రం.. ఉద్యోగుల సంక్షేమం కోసం .. ఆ పదవులు పొందిన వారు మాత్రం.. చనిపోయిన ఉద్యోగుల మట్టిఖర్చులతో మనకేం సంబంధం .. సీఎం జగన్ .. ప్రభుత్వాన్ని కాపు కాస్తే చాలనుకుంటున్నారు. ఈ జాబితాలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు.
ఉదయం సూర్యనారాయణరావు ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో గవర్నర్ను కలిసి ఏపీ ప్రభుత్వ జీతాలు, బకాయిలు సరిగ్గా చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మండిపడ్డారు. అధికారంతో గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారని నిలదీశారు. చట్ట విరుద్ధంగా సూర్యనారాయణతో పాటు ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ఆయన టీం కలిశారు. బయటకు వచ్చి ఆయన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతారనుకుంటే.. జగన్ కు సూర్యనారాయణరావు నొప్పి కలిగించారని ఫైరయ్యారు.
సూర్య నారాయణ కు కావాల్సింది సొంత ప్రయోజనాలేనని, ఉద్యోగుల ప్రయోజనాలు కాదని బండి ఆరోపించారు.అంతే కాదు సూర్య నారాయణ మాటలకు అర్థం పర్థం లేదని ఫైర్ అయ్యారు. టెలిగ్రామ్ లో నెంబర్లు చూపించి వారి సంఘంలో లక్షన్నర మంది సభ్యులు ఉన్నారని సూర్యనారాయణ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 12 పీఆర్సీలు తెచ్చిన సంఘం తమదని అన్నారు. 72 ఏళ్ళ చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఇన్ని చెప్పిన ఆయన.. మరి జగన్ ను.. తమ సమస్యల గురించి అడిగారా అంటే సమాధానం లేదు.