కేంద్ర ప్రభుత్వం మూడు , నాలుగు నెలల ముందుగానే ఎన్నికలకు సిద్ధమయినట్లుగా వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తుననాయి. అటు రాజకీయాల పరంగా.. ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగానే ఉన్నాయి.
కేంద్రం తరపున హఠాత్తుగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. రేపో, మాపో పెట్రోల్ ధరలను తగ్గిస్తారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అనూహ్యంగా ఎత్తుగడలు వేసి .. ఎన్నికలకు వెళ్లిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. లోక్‌సభను రద్దుచేసి డిసెంబర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ముందుస్తుకు వెళ్తున్నదన్నదానికి గట్టి సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిపికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మీజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 2024లో జరగాల్సి ఉన్నది.
పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిషాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే గుంభనంగా ఈసీ ఎన్నికల సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఒడిషాలోనూ అదే చేస్తోంది. అక్టోబర్ కల్లా ఈవీఎంలను రెడీ చసుకోవాలని నిర్ణయించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పట్నా, బెంగళూరలో సమావేశాలు జరిగాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఓ నేతను ఎంపిక చేసుకోలేకపోయారు అందుకే.. ఎన్నికల ఖర్చులు తగ్గించడానికి పాక్షిక జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నామని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంది.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక సారి జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్ లభిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత.. మోదీ హవాతో కలిసిపోతుందని భావిస్తున్నారు. మరో వైపు రాజకీయంగానూ బీజేపీ తన ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇతర పార్టీలు ప్రచారాలు చేసుకునేందుకు అవకాశం లేకుండా దేశంలో ఉన్న హెలికాఫ్టర్లన్నింటినీ బుక్ చేసేసుకుంటోంది. జీ 20 సదస్సును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమావేశం అయిపోయిన తర్వాత.. డిసెంబర్ ఎన్నికల కోసం ప్రత్యక్ష నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.