రాజకీయ నాయకులకు నిజాయితీ అంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా తరతరాలుగా రాజకీయాలకు అలవాటుపడిన కుటుంబాల నుంచి వచ్చిన నాయకుల విషయంలో అయితే ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. అంతా కూడా రొటీన్ వ్యవహారంలా ఉంటుంది. అవినీతికి పాల్పడడం కూడా వాళ్ళకు పెద్ద మేటర్ కాదు. అలాగే పేదలు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు అని కష్టాల్లో ఉన్న ప్రజల గురించి మీడియా ముందుకు వచ్చినప్పుడు, బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడే మాటలు కూడా పరమ రొటీన్ వ్యవహారమే. యాంత్రికంగా తాతల కాలం నాటి రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఎక్కడా కూడా చిత్తశుద్ధి కనిపించదు. ఒక్క విషయంలో తప్ప. అదే అధికారంలోకి రావాలన్న ఆశ. ఆ ఒక్క విషయంలో మాత్రం వందశాతం నిబద్ధత కనిపిస్తుంది. అందుకోసం అవసరమైతే వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తారు. వందలాది సభల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికల ఏడాదిలో మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలన్నీ ఇప్పుడు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అలాంటిది రెండేళ్ళ వ్యవధిలోనే ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో గెలిపించిన టిడిపి, బిజెపిలు చేసిన మోసాన్ని భరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. నేను స్వయంగా మూడు జిల్లాలు తిరిగాను. ప్రజలందరికీ బాధ ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడిని కానీ, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం అని చెప్పుకు తిరుగుతున్న ఆంద్రా మేధావుల(?) ఫోరం సంస్థను కానీ, ఇంకా పోరాడుతున్నామన్న చాలా మందిని కానీ నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు అస్సలు లేరు. జగన్తో సహా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఎవ్వరూ కూడా ప్రజల మనసులు గెలుచుకోలేకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఆంధ్రా మేధావుల ఫోరం సభ్యుల యాక్టివిటీస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాయి. పోరాటం చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళెవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యకు మాత్రం వెళ్ళడం లేదు. ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడటానికే ధ్యానం(?) నుంచి మేలుకుని వచ్చానన్న పవన్ కళ్యాణేమో వారం రోజుల్లోనే మళ్ళీ హైదరాబాద్ ఫాం హౌస్ గూటికి చేరుకున్నారు. ప్రత్యేక హోదా పోరాటంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవ్వరికీ దొరకరు. ఆ పార్టీ నాయకులంతా హైదరాబాద్లోనే ఉంటారు.
ఇక ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టైలే వేరే. లోటస్ పాండ్లో ఆయన ఏర్పాటు చేసుకున్న డెన్లోకి పార్టీ ముఖ్యనేతలకే అనుమతి లేనిదే ప్రవేశం ఉండదు. కనీసం పార్టీ ఆఫీసు పేరుతో వేరే అడ్రస్ అయినా ఉండి ఉంటే జగన్ని కలిసే అవకాశం నాయకులకు, నాయకులను కలిసే అవకాశం కార్యకర్తలకు ఉండేదేమో. కానీ జగన్వారి సామ్రాజ్యంలో అలాంటివేమీ ఉండవు. సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను కలిసేంత టైమే ఆయనకు లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏం కలుస్తాడు? తరచుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా ఆయనకు ఉన్నట్టుగా అనిపించదు. అలా ఉండి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాడు కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన నివాసాన్ని మార్చుకుని ఉండేవాడు కాదా? అవేమీ జరగలేదు. అలాంటి ఉద్ధేశ్యం ఉన్నట్టుగా కూడా ఏమీ కనిపించట్లేదు. ఒక రాష్ట్ర ప్రదాన ప్రతిపక్ష నేత… పరాయి రాష్ట్రంలో ఉండి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విచిత్రమైన పరిస్థితి దేశం మొత్తం మీద కూడా బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోనే జరుగుతోందేమో.
ఇప్పుడర్థమైందా? వీళ్ళ పోరాటం తీరు. రాజకీయ కార్యకలాపాల శైలి. ప్రజల దగ్గరకు వెళ్ళాలని నాయకులకు అనిపించినప్పుడు మాత్రమే ప్రజలను కలుస్తూ ఉంటారు. వీళ్ళకు ఓదార్చాలనిపించినప్పుడు మాత్రమే ప్రజల దగ్గరకు వెళ్తూ ఉంటారు. అలా సంవత్సరంలో కొంత కాలం రాజకీయాలకు కేటాయస్తారన్నమాట. ఎన్నికల సంవత్సరంలో మాత్రం 24 గంటలూ ప్రజల మధ్యే ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. మరి మిగతా నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళను కలవాలనిపిస్తే, వాళ్ళ సమస్యలను చెప్పుకోవాలనుకుంటే….?
ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం. వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం….అని భారీ డైలాగులు కొట్టే నేతాశ్రీలూ……కనీసం ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నం ఎప్పుడు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎప్పుడు నివసిస్తారు?