తెలంగాణలో తెల్లవారితే ఓటర్లు పోలింగ్ బూత్‌కు వెళ్తారనగా.. ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పై విరుచుకుపడ్డారు. దౌర్జన్యంగా ప్రాజెక్టులోకి ప్రవేశించారు. పదమూడు గేట్లు మావి అని చెప్పి బారికేడ్లు పెట్టుకున్నారు. నీరు విడుదల చేసుకున్నారు. ఈ వివాదంతో నాగార్జున సాగర్ తో పాటు శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లింది. డ్యామ్ రక్షణ బాధ్యతల నుంచి రెండు రాష్ట్రాల పోలీసులను తప్పించారు. పూర్తిగా సీఆర్పీఎఫ్ పరిధిలోకి డ్యాములు చేరాయి.
ఓ రాష్ట్ర నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుపై మరో రాష్ట్ర పోలీసులు దాడిచేయడం అసాధారణం. అర్థరాత్రి సాగర్ డ్యాం గేట్లు దూకారు. పదమూడు గేట్లు మా వాటా అని బారికేడ్లు అడ్డం పెట్టుకున్నారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని కేసు కూడా నమోదయింది. పొరుగు రాష్ట్రంలో ఎన్నికల సంందర్భంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ మిత్రులకు సాయం చేయడానికన్న విమర్శలు వైసీపీపై ఎక్కువగా వచ్చాయి. కేసీఆర్, జగన్ మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా జల వివాదాలను తాము ఇట్టే పరిష్కరించకుంటామని ఢిల్లీ దగ్గరకు పోయేది లేదని సీఎం గా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ప్రకటించారు. బేసిన్లు , బేషజాలు ఉండవని ఆయన మార్క్ డైలాగ్ కూడా చెప్పారు. కానీ మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో దానికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. అందుకే.. రాజకీయం కోసం రాష్ట్ర ప్రాజెక్టులతో రిస్క్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
గతంలో కూడా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు రేగినప్పుడు కేంద్రం ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ రెండు రాష్ట్రాలు అంగీకరించలేదు. అప్పట్లో ఆది ఆగిపోయింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మద్య పంచాయతీ తెగకపోతే కేంద్రమే స్వాధీనం చేసుకుని కేటాయింపుల మేరకు నీళ్లు విడుదల చేస్తుంది. ఇప్పుడు ఏపీ దూకుడు వల్ల రెండు ప్రాజెక్టులు కేంద్రం చేతిలో వెళ్లాయి.. ఇప్పుడు ఎవరు నష్టపోయారు ?