హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని ప్రీ ఫ్యాబ్ విధానంలో మంగళగిరి సమీపంలోని వెలగపూడిలో నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ భవన ప్రాంగణాన్ని మొదట అనుకున్నట్లుగా 20 ఎకరాలలో కాకుండా 45.129 ఎకరాలలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. సీఆర్డీఏ నివేదిక ఆధారంగా ఈ మార్పు చేసినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.17 ఎకరాలలో ప్రజా సదుపాయ భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ భవన ప్రాంగణ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. జూన్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 12వ తేదీన శంకుస్థాపన చేయాలని తలపెట్టినా కూడా టెండర్లు ఖరారు కాకపోవటంవల్ల దానిని వాయిదా వేశారు. రు.180 కోట్లతో ఈ భవన ప్రాంగణాన్ని నిర్మించనున్నారు.