ప్రభుత్వ వైద్యశాలల్లో బాగా సీనియర్లుగా వున్న ప్రొఫెసర్లకు 65 ఏళ్ల వరకూ పదవీ కాలం పొడగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తుది నిర్ణయం ఇంకా తీసుకోవలసి వుంది. ఇది కూడా బాగా సీనియర్లయిన వారికేనని ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు.కాని ప్రభుత్వ వైద్యుల సంఘం మాత్రం దీని వల్ల తమ ప్రమోషన్లు దెబ్బతింటాయని విమర్శిస్తున్నది.పైన తిష్ట వేసిన కొద్దిమంది సీనియర్లు కుట్ర పన్ని ఈ ప్రతిపాదన చేయించారనీ. కావాలంటే తమకు ప్రమోషన్లు ఇచ్చి వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయాలని ఆ సంఘం ప్రతినిధి ఒకరు వింత వాదన చేశారు. విభజన తర్వాత ఏపిలో పదవీ విరమణవయస్సు 60కి పెంచారు. తెలంగాణలో యథాతథంగా వుంది. ఇప్పుడు సీనియర్ డాక్టర్లకు ఏకంగా 65 ఏళ్లవరకూ పెంచడం ఫ్రభావంపై రకరకాల ఆలోచనలు వినిపిస్తున్నాయి.
మనుషుల జీవన ప్రమాణం పెరగడంతో పాటు ప్రత్యేక నైపుణ్యం గల వారికోసం ఇలాటి నిర్ణయం తీసుకుంటే తప్పులేదని ఒక వాదన. అయితే అంతకన్నా ముఖ్యమైన అంశం ఒకటుంది. విజయవాడ గుంటూరు లేదా రాజధాని ప్రాంతం వైద్య కేంద్రంగా పెంపొందాలంటే అక్కడ ఆరితేరిన వైద్య నిపుణులు వుండాలి.ప్రస్తుతం వారంతా హైదరాబాదులోనే వుండిపోయినందున అలాటి అభివృద్ధికి ఆటంకంగా వుందని ఇటీవల విజయవాడ వె ళ్లినప్పుడు ప్రముఖ డాక్టర్లు కొందరు చెప్పారు. ఎన్టీఆర్ ప్రత్యేక నిబంధనలతో నిమ్స్‌లో నియామకాలకు అనుమతించినందునే హైదరాబాదులో అంతగా వైద్య విస్తరణ జరిగిందని వారంటారు. ఆ పరిస్థితి విజయవాడలో రావాలంటే అదనపు సదుపాయాలు కల్పించడంఅనివార్యమంటున్నారు. అంతేగాక విభజన తర్వాత కూడా హైదరాబాదులోని ప్రముఖ డాక్టర్లు విజయవాడ రావడానికి ఇష్టపడకపోవడం, ఆప్షన్లపై తెలంగాణ డాక్టర్ల సంఘం నిరసన దృష్ట్యా కూడా వారిని ఆకర్షించడానికి ఇలాటి చర్యలు అవసరమవుతున్నాయని చెబుతున్నారు