తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా అని రెచ్చిపోయారు. తన కూతురిపై .. వైఎస్ బిడ్డపై చేతులెత్తేస్తారా అని శివాలెత్తారు. అయితే ఇప్పుడు ఏపీలో.. సీఎం జగన్ రెడ్డి పాలనలో ఉన్న పోలీసులే షర్మిలను అంత కంటే ఘోరంగా అరెస్టు చేశారు. తోపులాటలో షర్మిల చేతికి కూడా గాయం అయింది.
మెగా డీఎస్సీ కోసం షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలో కేవీపీ ఇంట్లో బస చేశారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారని సమాచారం రావడంతో ఆమె వెంటనే కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయమే.. అక్కడ ఉన్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత షర్మిల ధర్నా చేసి.. సెక్రటేరియట్ కు బయలుదేరారు. దారిలో వందల మంది పోలీసుల్ని మోహరించిన ప్రభుత్వం మధ్యలో బలవంతంగా అరెస్టు చేసింది. బలవంతంగా ఎత్తేసి తీసుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడేశారు. తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి.. తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు. ఆడబిడ్డపై చేయి వేయడం జగన్ రెడ్డి పాపమని మండిపడ్డారు. పాలనే చేతకావడం లేదని .. ఏమీ చేయడం లేదని.. ఇదా వారసత్వం అని ప్రశ్నించారు. ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. ఇప్పుడు గతంలో షర్మిల, తానుకలిసి తిరిగి ఓట్లు వేయమని ప్రచారం చేసిన చోటునే.. అధికారంలోకి వచ్చిన కొడుకు.. కూతుర్ని పోలీసులతో అరెస్టు చేయించడం మాత్రం విజయమ్మకు ఇబ్బందికరమైన అంశమే. ఈ విషయంలో కూతుర్ని.. కొడుకును కూడా సమర్థించలేరు. వ్యతిరేకించలేరు. కొడుకు చేస్తున్నది తప్పని చెప్పలేని పరిస్థితిలో ఆమె ఉన్నారు.