జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేసిన మాజీ ఐఏఎస్ అెధికారిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు విఫలయత్నం చేశారు., హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు దాదాపుగా ఇరవై మంది వరకూ పోలీసులు వచ్చారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ చేయలేకపోయారు. పోలీసులు రాక… అరెస్ట్ కు కారణాలు తెలియక కుటుంబ సభ్యులు గందరగోళంలో పడుతున్నారు. పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిమ్స్ బాధ్యతలు సహా అత్యంత కీలకమైన పదవుల్లో పని చేశారు .
తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు. మధ్యలో ఏం జరిగిందో కానీ ఆయనను అవమానకరంగా బయటకు పంపేశారు. అప్పట్నుంచి పీవీ రమేష్ సైలెంట్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు చేస్తూంటారు. అయితే నేరుగా ఎవర్నీ ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయరు. ఆయన సోదరిని ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ వివాహం చేసుకున్నారు.
అయితే ఆయనపై గృహ హింస కేసును ఆమె నమోదు చేసింది. ఆ వివాదం ఉంది. ఈ క్రమంలో పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఆయనపై నమోదైన కేసేంటి..? చట్ట బద్దంగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..? లాంటి అంశాలపై స్పష్టత లేదు. పీవీ రమేష్ ఈ అంశంపై స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.