ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అంతగా ఆసక్తి ఉంటే ఖాకీ డ్రెస్ వదిలేసి రాజకీయాల్లో చేరిపోవాలని హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రోజే… దారుణం వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు వైసీపీ నాయకులతో కుమ్మక్కయి.. ఓ దళిత యువకుడిపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా…. శిరోముండనం కూడా చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. వైసీపీ నాయకులకు చెందిన అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారన్న కారణంగా కవల కృష్ణమూర్తి అనే వైసీపీ నాయకుడు.. కారుతో.. వరప్రసాద్ అనే యువకుడిని ఢీకొట్టాడు. ఆ తర్వతా పోలీసులకు చెప్పారు. వారు వచ్చి వరప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి చితకబాదారు. శిరోముండనం చేశారు. వరప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.
మొదట్లో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తర్వాత విషయం బయటకు రావడంతో కలకలం రేపింది. వైసీపీ నాయకుల అక్రమాలకు వంత పాడటమే కాకుండా.. అడ్డుకున్నారని దళిత యువకుడికి శిరోముండనం చేయించడం.. అందులో పోలీసులే భాగస్వామిగా మారడం… జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. వెంటనే… పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సీతానగరంలో ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. అయితే.. పోలీసుల తీరు దారుణంగా ఉందని..ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఉదయమే… కాకినాడకు చెందిన లాయర్ సుభాష్ చంద్రబోస్‌ను.. పోలీసులు అర్థరాత్రి పూట కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుభాష్ చంద్రబోస్ ను స్వయంగా ఎస్పీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీసు వ్యవస్థ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లాయర్ కే అలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు. ఏపీలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే… పోలీసుల తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. వెలుగు చూస్తునన ఘటనలు.. వారి పనితీరుపై ప్రజల్లో సందేహాలు అంతకంతకూ పెంచుతున్నాయి.