రామ్ గోపాల్ వర్మ తాను మారిపోయానని.. సిండికేట్ అనే సినిమా తీసుకుంటానని బుద్దిగా ఉంటానని చెబుతున్నారు కానీ.. చేసిన పాపాలు మాత్రం వెంటాడుతున్నాయి. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కళ్ల ముందు ఉండగా.. ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలో విచారణకు రాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు అవుతుంది. దాంతో విచారణకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితి అర్జీవీకి ఎదురవుతోంది.
వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని చంద్రబాబు, పవన్ లకు వ్యతిరేకంగా.. కించపరిచేలా అసభ్యంగా పోస్టులు పెట్టారన్న కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయనకు గతంలో ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు వస్తానని చెప్పి పరారయ్యారు. తర్వాత కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. విచారణకు సహకరిస్తానని హమీ ఇచ్చారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాను నేరుగా హాజరు కానని .. వర్చువల్ విచారణకు హాజరవుతానని గతంలో ఆర్జీవీ చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి చాన్స్ లేదు. నేరుగా హాజరవ్వాలి.
ఫిబ్రవరి నాలుగో తేదీన ఆర్జీవీని హాజరు కాకపోతే పోలీసులు వెంటనే విచారణకు సహకరించడం లేదని చెప్పి బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేస్తారు. దాంతో ఆర్జీవీని సమస్యలు ఎదుర్కొంటారు. మరో వైపు ఏపీ ఫైబర్ నెట్ కు ఆయన డబ్బులు కట్టాల్సి ఉంది. నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులపై డబ్బులు కట్టకపోతే ఇంకో కేసు నమోదు చేసి చాలా కాలం బయటకు రాకుండా జైల్లోనే ఉంచే అవకాశం ఉంది. ఓ వైపు ముంబై కోర్టు..మరో వైపు ఏపీ పోలీసులు ఆర్జీవీకి నిద్ర లేకుండా చేస్తున్నారు.