సర్.. ప్లీజ్ గతాన్ని వదిలేయండి..అప్పుడు జరిగిన వాటిని మనసులో పెట్టుకోకండి..పెద్ద మనస్సుతో మమ్మల్ని మన్నించండి.. ఇది ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల వేడుకోలు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో వర్ల రామయ్యను కలిసి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు క్షమాపణలు కోరారు. గతంలో జరిగిన వాటన్నింటిని వదిలేయాలని బ్రతిమాలారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ పోలీసులు కొంతమంది రెచ్చిపోయారు. పోలీసులమన్న సంగతి మరిచి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు. టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇందులో కొంతమంది జగన్ మెప్పు కోసం చేస్తే.. మరికొంతమంది ప్రమోషన్ల కోసం చేశారు. తొడకొట్టి మరీ చంద్రబాబు సంగతి తేలుస్తామంటూ పోలీసు వ్యవస్థకు కళంకం తెచ్చేలా డైలాగ్ లు కొట్టారు.
Read More : పరామర్శలోనూ రాజకీయాలేనా!
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి రావడంతో గతంలో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన పోలిసులకు భయం పట్టుకుంది. తమకు ఇబ్బందులు తప్పవని అంచనాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా టీడీపీ నేతలను కలిసి క్షమాపణలు కోరుతున్నారు. టీడీపీ లీడర్ల పట్ల గతంలో అలా వ్యవహరించడానికి వైసీపీ నేతల ప్రోద్బలమే తప్ప ఉద్దేశపూర్వకం ఏమి కాదని చెప్పుకొస్తున్నారు.
శుక్రవారం వర్ల రామయ్యను కలిసి క్షమాపణలు కోరిన పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అనంతరం మాట్లాడారు. నాడు చంద్రబాబుపై విమర్శలు చేసినప్పుడు ఓ అధికారిగా అలా చేయకూడదని నాకూ అనిపించిందని చెప్పారు. నాడు వైసీపీ పెద్దల ఆదేశాలతోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలు చేశారు. గతంలో ఏపీ పోలిసులపై నమ్మకం లేదన్న జగన్.. తన హయాంలో రాష్ట్ర పోలీసులతోనే ఐదేళ్ళు పాలించారన్నారు. ఇప్పుడు మళ్లీ పోలీసులని నిందించడం సరికాదన్నారు.