తన దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా ఉంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. వైసీపీలో అంట కాగుతూ వస్తున్న వారికి ఇవాళ పోలీసులు వారి స్థానం ఏమిటో చూపించారు. కావలిలో చుక్కల భూములన్నింటికీ యాజమాన్య హక్కులు ఇచ్చేస్తున్నానని సభ పెట్టిన సీఎం జగన్కు నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. అసలు సభ దగ్గరకు కూడా వెళ్లలేదు. కాన్వాయ్ ను అడ్డుకుంటారేమోనన్న ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న వారిని కూడా వదిలి పెట్టకుండా లాగేశారు. ఈ క్రమమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఓ కార్యకర్తను పోలీసు అధికారి తలను తన రెడు కాళ్ల మధ్య ఉంచుకున్న ఫోటో వైరల్ గా మారింది. పోలీసు అరాచకాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపేలా ఉన్న ఆ ఫోటో ఇప్పుడు బీజేపీకి వైసీపీ తన స్థానాన్ని చూపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కన్నా.. ఫోటో వైరల్ అయిన తర్వాత బీజేపీ నేతలు నిద్ర లేచారు. రాష్ట్రంలో అరచాక పాలన జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతల పై పోలీసులు అరాచకంగా వ్యవ హరిస్తూ ఒక భయానక వాతావారణాన్ని సృ ష్టిస్తున్నారని సోమువీర్రాజు సాయంత్రం అరుపులు ప్రారంభించారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురు బిజెపి నేతల పై దాడికి పాల్పడ్డారని..వారిని ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారోకూడా చెప్పడంలేదన్నారు. ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సోము వీర్రాజు తప్పనిసరిగా అన్నారో.. లేకపోతే నిజంగా అన్నారో కానీ.. పోలీసులు ఇంత కాలం పెద్దగా బీజేపీ నేతల జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు వారికి తమ స్థానాన్ని చూపించినట్లయింది.
కేంద్ర పెద్దలకు అయినా ఏపీలో పరిస్థితులేమిటో ఈ ఫోటో ద్వారా అవగతమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఫోటో పోలీసు క్రూరత్వానికి సాక్ష్యంగా వైరల్ అవుతోంది.