చింతమనేని ప్రభాకర్ ను పట్టుకోలేకపోవడం … పోలీసుల వైఫల్యమంటూ… వరుసగా పోలీసులపై వేటు వేస్తున్నారు ఉన్నతాధికారులు. అసలు పోలీసుల సాయంతోనే చింతమనేని ప్రభాకర్ పరారయ్యారంటూ.. సాక్షి పత్రికలోనే కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కంట్రోల్ రూమ్లో పని చేస్తున్న ఓ మహిళా ఎస్సైను.. గతంలో… నమోదైన కేసుల్లో చురుగ్గా వ్యవహరించలేదని సస్సెండ్ చేశారు. మరో ఎస్ఐపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారని చెబుతున్నారు. అయితే.. చింతమనేనికి సహకరించారంటూ… మరికొంచెం పై స్థాయి అధికారులపైనా… వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
మూడు రోజులు పాటు కోర్టుకు సెలవులు కావడంతో చింతమనేని కోర్టులో ఆయన లొంగిపోయే అవకాశాలు లేవు. ఈలోగా ఆయనను అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం తెలియడం లేదు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ.. ఉన్నత స్థాయిలో తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు .. పోలీసుల ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లుగా పోలీస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చింతమనేని అందుబాటులో ఉన్నా అరెస్ట్ చేయలేకపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నోటిమాటగా ఆదేశించారు. దాంతో ఏలూరు త్రీ టౌన్ సిఐ మూర్తిని సస్పెన్షన్ చేసినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా మరో ఇద్దరు యస్ ఐ లు, కొంతమంది కానిస్టేబుల్స్ పైనా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. ఓ మహిళా ఎస్ఐ పేరును అధికారికంగా ప్రకటించారు.
చింతమనేని వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు దిగువ స్థాయి పోలీస్ సిబ్బందిలో అసంతృప్తికి కారణం అవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుస్తామని, కానీ చింతమనేని కేసు విషయంలో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారని దిగువ స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు.. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా.. అడ్డుకోవడం లేదని… ఆ పార్టీ నేతలు మండి పడుతున్నారు. బాధితుల శిబిరం ఏర్పాటు చేసి.. టీడీపీ అధినేత .. గ్రామాలకు వెళ్తానని సవాల్ చేశారు. మరో వైపు ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల్ని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అదే వైసీపీకి చెందన సోషల్ మీడియా కార్యకర్తలు.. ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలపై.. దారుణమైన పోస్టులు పెడుతున్నా.. వారు పదే పదే ఫిర్యాదు చేస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై వారూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.