“దిశ” ఆకృత్యంలో మృగాళ్ల పైశాచికం దేశంలో ఎంత చర్చనీయాంశమయిందో.. పోలీసుల తీరు కూడా అంతే వివాదాస్పదమయింది. దిశ తల్లిదండ్రులు.. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. తమ పరిధిలోకి రాదంటూ.. పోలీసులు మూడు స్టేషన్ల చుట్టూ తిప్పారు. తీరా ఫిర్యాదు తీసుకుని రంగంలోకి దిగే సరికి… నేరం.. జరిగిపోయింది. పోలీసుల తీరుపై.. చాలా విమర్శలు వచ్చినా… నిజంగానే.. నిబంధనల ప్రకారం… వారి పరిధిలోకి రాని ఫిర్యాదును తీసుకునే అవకాశం లేదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. నిజానికి ఇలాంటి సమస్యలు ఎన్నాళ్ల నుంచో ఉన్నాయి. దీనికి పరిష్కారంగా.. జీరో ఎఫ్ఐఆర్ అనే విధానం తెరపైకి వచ్చింది. చర్చల్లో నలుగుతున్నప్పటికీ… దీన్ని ఇంత వరకూ అమల్లోకి తీసుకు రాలేదు.
మొదటి సారి… దిశ విషాదాంతం తర్వాత ఏపీ పోలీసులు ఈ దిశగా మొదటి అడుగు వేశారు. ఏపీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో.. జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వారంలో విధివిధానాలు తయారు చేస్తామని.. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా తీసుకొస్తాం డీజీపీ సవాంగ్ ప్రకటించారు. జీరో ఎఫ్ఐఆర్ వల్ల పోలీసులకు కొంత ఇబ్బంది ఉన్నా.. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఇబ్బందుల్ని అధిగమిస్తామని ప్రకటించారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. పోలీసులు హద్దులనేవి లేకుండా ఎవరైనా ఫిర్యాదుకు వస్తే.. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే జీరో ఎఫ్ఐఆర్. ప్రతి ఎఫ్ఐఆర్కు ఒక సీరియల్ నంబర్ ఉంటుంది.
అయితే నమోదైన ఎఫ్ఐఆర్ తమ ప్రాంతం, పరిధిలోనిది కాకపోతే.. నంబర్ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. తర్వత పోలీసుల ప్రాధమిక దర్యాప్తు అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేసి.. వారి నంబర్‌ను కేటాయించవచ్చు. ఇలా వెంటనే.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు విచారణ ప్రారంభిస్తే.. ప్రజలకు సత్వర రక్షణ దొరుకుతుందనే అభిప్రాయం ఉంది. ఏపీలో అమలు చేసి.. ఆదర్శంగా నిలిచేందుకు .. పోలీసులు ప్రయత్నిస్తున్నారు.