కరెన్సీ నోట్లపై వైరస్ ఉంటుందా..? అత్యధికంగా నోట్లతో లావాదేవీలు నిర్వహించేవారికి వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందా..?. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇలాంటి అనుమానాలు నిజమేనని పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాలు, కిరాణా, కూరగాయలు మొదలుకొని మెడికల్ షాపులు, కేబుల్ టీవీ ఆపరేటర్ల వరకూ చేత్తో డబ్బు తీసుకునేవారిలో చైతన్యం తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు ట్రావెల్ హిస్టరీ లేదు. అప్పటికీ పాజిటివ్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ కాలేదు. కానీ వారు.. చిల్లర వ్యాపారులు. ఎక్కువ మంది నుంచి నగదు తీసుకునే వ్యాపారులు కావడంతో.. డీజీపీ గౌతం సవాంగ్.. ఈ కోణంలో ఎస్పీలకు లేఖ రాశారు.
కరెన్సీ నోట్లు వైరస్ వాహకాలన్నట్లుగా డీజీపీ ఎస్పీలకు లేఖ రాసిన విషయం సోషల్ మీడియాలో హైలెట్ ్యింది. దీనిపై.. తర్వాత డీజీపీ వివరణ ఇచ్చారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తోందని నిర్ధారణ కాలేదన్నారు. ప్రభుత్వం సూచించినవిధంగా వీలైనంతవరకూ డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పుకొచ్చారు. నిర్ధారణ కాని వార్తల ద్వారానే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. న్యూస్ పేపర్ల ద్వారా వైరస్ వస్తుందన్న ప్రచారం జరగడంతో.. అది ఆ పత్రికలక మనుగడకే ముప్పు తెచ్చింది. అలా పత్రికల ద్వారా వైరస్ రాదని.. చెప్పుకునేందుకు ఆయా పత్రికలు తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు పోలీసులు కరెన్సీ నోట్ల విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు.
నిజానికి ఇలాంటి అనుమానాలు ఉంటే పోలీసులు ముందుగా ప్రభుత్వానికి ఈ దిశగా స్పష్టమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. వాలంటీర్లు పెద్ద ఎత్తున ఇళ్లకు వెళ్లి రూ. వెయ్యి కరోనా సాయంతో పాటు.. సామాజిక పెన్షన్లు నేరుగా వృద్ధులకు అందిస్తున్నారు. వీరు ఇచ్చే నోట్లు అనేక మంది చేతులు మారి ఉంటాయి. పైగా వృద్ధులకు కరోనా మరింత ప్రమాదకరం. నేరుగా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నా.. ఇలా చేయడంతో ముప్పు పొంచి ఉన్నట్లవుతుంది. ప్రభుత్వం వైపు నుంచి నేరుగా నగదు పంపిణీ జరుగుతూంటే .. ప్రజల్ని మాత్రం ఆ దిశగా వెళ్లేలా చేయాలని.. డీజీపీ .. ఎస్పీలకు సూచనలు పంపారు. కరెన్సీ నోట్లపై వైరస్ ఉంటుందో లేదో సైంటిఫిక్గా నిర్ధారణ కాకపోయినా.. ఓ కొత్త అనుమానాల్ని మాత్రం ప్రజల్లోకి బలంగా పంపారు పోలీసులు. ఇక నుంచి ప్రజలు డబ్బులు తీసుకోవడానికి కూడా భయపడతారేమో..?