ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది పార్ట్ టైం పొలిటీషియన్సే. వాళ్ళ వ్యాపారాలు, వ్యాపకాలు, వృత్తులతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము అని ప్రజలను నమ్మించడం కోసం సామాజిక మాధ్యమాల్లోనూ, మీడియాలోనూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఎన్నికల వరకూ అస్థిత్వాన్ని నిలుపుకునే బాపతు జనాలే ఎక్కువ మంది. ఇక సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే మరీ అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలన్న ఆత్రంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడన్న విషయం కనీసం ఆయనకన్నా గుర్తుందో లేదో తెలియదు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణనేమో బంటులతో రాజ్యం నడిపిస్తున్నాడు. ఇక పాలిటిక్స్‌లో ఉన్న హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాల్లో సాంగ్ అవసరమైనప్పుడే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్టుగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పొలిటికల్ తెరపైన కనిపిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత కంటే ఎక్కువగా ఎప్పుడూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే రోజాకు ఏ రేంజ్లో మంచి పేరు వచ్చి ఉండాలి. కానీ రోజా మాట తీరు కాస్తా ఆమెను చాలా మందికి దూరం చేస్తోంది. ‘నోరా…వీపుకు చేటు తేకే…’ అనే సామెత రోజాకు తెలుసో తెలియదో కానీ ఆ సామెత రోజాకు సరిగ్గా సూట్ అవుతుంది.
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరవడానికి బయల్దేరిన రోజాను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నాయకుడి ఆలోచనలను అనుసరించి పనిచేయడం అనేది మన పోలీసులకు ఎప్పుడో అలవాటైన విద్య. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలీసుల వ్యవహారం అలానే ఉండేది. ఇప్పుడు చంద్రబాబు జమానాలో కూడా సేం టు సేం వర్కింగ్ స్టైలే ఫాలో అవుతున్నారు. అందులో పోలీసుల తప్పు ఏముంది? పోలీసుల పనితీరును అలా మార్చిన రాజకీయ నాయకులది తప్పు అవుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఓ స్థాయిలో విమర్శలు చేశాడు. ఇప్పుడు జగన్ అండ్ కో కూడా అలాంటి విమర్శలే చేస్తున్నారు. అందులో తప్పు కూడా లేదు. లా అండ్ ఆర్డర్‌ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని కూడా విమర్శలు చేసుకోవచ్చు. కానీ విశాఖ విమానాశ్రయంలో జగన్ అయినా, మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా రోజా అయినా డైరెక్ట్‌గా పోలీసులనే విమర్శించడం ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం తప్ప పోలీసులకు ప్రత్యామ్నాయం ఉందా? ఒకవేళ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన చెప్పినట్టుగా పనిచేసే పోలీసులు కావాలని జగన్ కోరుకోడా? వైఎస్, చంద్రబాబు, కెసీఆర్, జగన్…..నాయకుడి పేరు ఏదైతేనేం….అందరి తీరూ ఒక్కటే. తమకు భక్తుడిలా వ్యవహరించే లాంటి వ్యక్తి, లేకపోతే వెన్నెముక లేని నాయకుడే హోం మినిస్టర్‌గా ఉండాలి…. పోలీసు వ్యవస్థ మొత్తం అధినేతలకు నచ్చినట్టుగానే పని చేయాలి. ఆ మాటకొస్తే అన్ని వ్యవస్థలు కూడా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని బలంగా కోరుకోని నాయకుడు ఎవరున్నారు? మరి అలాంటప్పుడు పోలీసుల పనితీరుపై కోపం వస్తే డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని విమర్శించాలి, లేకపోతే వాళ్ళ స్టైల్లో తిట్టుకోవాలి. అంతేగానీ పోలీసుల అంతు చూస్తాం అనడం, పోలీసులను విమర్శించడం ఎంతవరకూ న్యాయం? అసలే రాజకీయ నాయకుల మధ్య గొడవల్లో పోలీసులు ఇరుక్కుపోతూ ఉంటే….ఆ పైన నాయకుల చేతిలో తిట్లు కూడా పోలీసులే తినాలని నాయకులు కోరుకోవడం ఎంత వరకూ న్యాయం? అందుకే ఎమ్మెల్యే రోజావారు పోలీసులకు క్షమాపణ చెప్పడమే కరెక్ట్. కావాలంటే ఆ క్షమాపణ చెప్తున్న సందర్భంలోనే చంద్రబాబునాయుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకోవొచ్చు.