ఎన్నికల వరకూ తిరుగులేకుండా సీఎస్‌గా ఉంటారనుకున్న సోమేష్ కుమార్ అదృష్టం ఒక్క సారిగా తిరగబడింది. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంలో పెద్దగా కీలక బాధ్యతల్లో ఉన్నట్లుగా కనిపించని శాంతికుమారి అనే సీనియర్ ఐఏఎస్ అఫీసర్ సీఎస్ అయిపోయారు. అసలు ఆమెను ఎంపిక చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆర్థిక శాఖ చూస్తున్న రామకృష్ణారావు కేసీఆర్‌కు చాలా దగ్గర. ఆయనే సీఎస్ అవుతారనుకున్నారు. కానీ కేసీఆర్ శాంతి కుమారిని ఎంపిక చేసుకున్నారు.
ఆ తర్వాత ఆయనను ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ లో కలిశారు. వారితో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆ ఫోటో కూడా ప్రగతి భవన్ వర్గాలు రిలీజ్ చేశాయి. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కూడా కేసీఆర్ ను కలిశారు. వీరిద్దరూ ఐఏఎస్ బాధ్యతల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాపు కోటా రాజకీయాలు చేస్తున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు రామ్మోహన్ రావు వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమయింది. ఆయన తర్వాత జనసేనలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మొగ్గుతున్నారు.
అసలు శాంతి కుమారితో పాటు వీరు కూడా కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లడానికి కారణం… కాపు కోణమట. శాంతి కుమార్ ఏపీ కి చెందిన వారు. ఆమె కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఏపీలో కాపు సామాజికవర్గంపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ కోణంలోనే ఆమెను సీఎస్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు. అందుకే ఆ వెంటనే ఏపీ కాపు బీఆర్ఎస్ నేతల్ని ప్రగతి భవన్‌కు ఆహ్వానించారంటున్నారు. ఇలాంటి సమీకరణాల వల్ల ఎంత లాభం వస్తుందో కానీ.. అధికారవర్గాల్లో మాత్రం గతంలో మంత్రి పదవులు మాత్రమే సామాజిక సమీకరణాలు చూసేవారని..ఇప్పుడు అధికారుల్లోనూ చూస్తారన్న చర్చ జరుగుతోంది.