ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకూ ఏదీ కలసి వస్తున్నట్లుగా లేదు. కొత్తగా ప్రస్తుతం బీజేపీలో చక్రం తిప్పుతున్న ఇద్దరు నేతలు ఓ భారీస్కాంలో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. రాయలసీమలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో జరిగిన ఐటీ, ఈడీ దాడుల కేసుల నుంచి బయట పడేస్తామంటూ ఇద్దరు రూ. ముఫ్పై కోట్లను వసూలు చేసినట్లుగా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించి కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కూడా కథనం ప్రచురించింది. మొత్తంగా ఎక్కడెక్కడ ఎంత ఎంత వసూలు చేశారు.. ఏ బ్యాంక్ నుంచి చేశారు.. ఎలా తరలించారు అన్న అంశాలపై కూడా పూర్తి వివరాలను కేంద్ర నిఘా సంస్థ సేకరించి … కేసు నమోదుకు సిద్ధమయిందని చెబుతున్నారు.
గత ఏడాది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలోసోదాలు జరిగాయి. వందల కోట్ల అక్రమ లావాదేవీలు పెద్ద ఎత్తున నగదును స్వాధీనంచేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. తమిళనాడులోని ఆ ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. కళ్లు తిరిగేంతటి నగదు.. ఆస్తులు… అక్రమ లావాదేవీల్ని గుర్తించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు వ్యవహారం సద్దుమణిగింది. ఇంత కంటే పెద్ద ఆశ్రమాలపై గత ఏడాది దాడులు జరగలేదు. బహుశా.. బీజేపీ నేతలు ఇద్దరు ఈ ఆశ్రమంలో జరిగిన సోదాలు కేసుల నుంచి బయటపడేయడానికి బీజేపీ నేతలు డబ్బులు వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీ బీజేపీ నేతలు .. చాలా మంది దందాలకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పోస్టు పొందిన వ్యక్తి… తెలుగు వ్యక్తినేనని చెప్పుకుని చిన్నప్పుడే ఢిల్లీలో స్థిరపడిపోయిన మరో నేత కలిసి.. ఏపీలో డబ్బుల సాగు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా తమ సొంత ప్రభుత్వానికే వారు దొరికిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో నిజానిజాలు బయటకు వస్తే.. వారి రాజకీయ భవిష్యత్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. అది బీజేపీకి కూడా ఇబ్బందికరం కాబట్టి… ఎలా డీల్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం.