ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు జాతీయ స్థాయి పరిణామాల పట్ల స్పందించడానికి కూడా భయపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన అగ్నిపథ్ స్కీమ్ అంశంపై ఆందోళనలు జరుగుతున్నాయి. అవి అల్లర్ల స్థాయికి చేరాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ వాదన వినిపిస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ అగ్నిపథ్ స్కీమ్‌ను డబ్బులు ఆదా చేసుకుని.. నిరుద్యోగుల్ని మోసం చేసి.. సైన్యాన్ని బలహీనం చేసే పథకం అని విశ్లేషిస్తున్నాయి. అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కానీ ఏపీ రాజకీయ పార్టీలు మాత్రం ఇంత వరకూ స్పందించలేదు.
ఏపీలో అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ యువత ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. అగ్నిపథ్ మంచిదో కాదో చెప్పడంలేదు. మంచిది అయితే అదే విషయాన్ని యువతకు చెప్పాల్సింది. మంచిది కాకపోతే ఆ విషయమైనా చెప్పాల్సింది. కానీ ఇలాంటి కీలకమైన విషయంలో ఎలాంటి స్పందన లేకుండా నిస్తేజంగా ఓ కీలకమైన రాజకీయ పార్టీ ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీగా ఓ అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలి. కానీ మంచిది కాదంటే మోదీకి.. కేంద్రానికి ఎక్కడ కోపం వస్తుందోనని భయపడుతున్నట్లుగా పరిస్థితి ఉంది.
ఇక ఏపీ విపక్ష పార్టీలయిన టీడీపీ, జనసేన గురించి చెప్పాల్సిన పని లేదు. అధికార పార్టీనే స్పందించలేదు.. ఇక తమకెందుకు ఈ ఇబ్బంది అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో మౌనం పాటిస్తోంది. టీడీపీదీ అదే ఇబ్బంది. బీజేపీతో కలవకపోయినా బహిరంగంగా ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించే ప్రయత్నం చేయడం లేదు. జనసేన పార్టీ నేరుగా బీజేపీతో పొత్తులో ఉంది. అయినా దేశ సైనికుల విషయంలో తొందరపాటు ప్రకటనలు ఎందుకని .. పరిణామాలపై వేచిచూడాలనే అభిప్రాయానికి వస్తున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయ పార్టీలు.. కీలకమైన అంశాల్లో కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించలేని నిస్సహాయ పరిస్థితికి చేరాయి.