హైదరాబాద్: ఇకనుంచి ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచనేమీలేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్‌సింగ్ నిన్న లోక్‌సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక్కసారిగా కాక పుట్టించింది. కేంద్రమంత్రి ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించికాదని తెలుగుదేశం సర్దిచెప్పటానికి ప్రయత్నించింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నిన్న విజయవాడలో ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ప్రయత్నాలు కొనసాగించాలని క్యాబినెట్లో నిర్ణయించినట్లు చెప్పారు. ఇవాళ చంద్రబాబు విజయవాడలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, నిన్నటి ప్రకటన 14వ ఆర్థికసంఘం నివేదిక ఆధారంగా చేసినదని, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు అది వర్తించదని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ నాయకురాలు పురందేశ్వరి దీనికి విరుద్ధంగా చెప్పారు. 14వ ఆర్థికసంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అవసరంలేదని తేల్చిచెప్పిందని అన్నారు. అయినా కేంద్రం ఏపీకి నిధులు ఇబ్బడిముబ్బడిగా ఇస్తోందని, వాటిని రాష్ట్రప్రభుత్వం సరిగా ఉపయోగించుకుంటే సరిపోతుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. సాంకేతిక కారణాలవలన ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోందన్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకహోదా రాదని ఖరాఖండిగా చెప్పి సంచలనం సృష్టించారు. పవన్ పోరాడితే తాముకూడా ఆయనమార్గంలో నడుస్తామని చెప్పారు. మరో ఎంపీ రాయపాటి సాంబశివరావుకూడా ఇలాగే మాట్లాడారు. ప్రత్యేకహోదా వస్తుందని నమ్మకం తనకు లేదని చెప్పారు. హోదావిషయంలో మోసంచేస్తే భారతీయజనతాపార్టీకే నష్టమని అన్నారు. హోదాకోసం పవన్ పోరాడలంటూ సమస్యను పవన్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రత్యేకహోదాకోసం ప్రయత్నిస్తామని, వీలుకాకపోతే ప్రత్యేక ప్యాకేజి అయినా సాధిస్తామని చెప్పారు. కేంద్రంతో గొడవకు దిగితే ఉపయోగంలేదని అన్నారు.
అధికారపక్షాలను ఎండగట్టడానికి మంచి అవకాశంవచ్చిందికాబట్టి యథావిధిగా కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయింది. తెలుగుదేశం నేతలు రాష్ట్రప్రజల ప్రయోజనాలను మోడి కాళ్ళదగ్గర పెట్టారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. టీడీపీ నేతలు మోడి అంటే భయపడుతున్నారని చెప్పారు. మోడిదగ్గరకు వెళ్ళటానికి అంత భయమైతే వామపక్షాలనుగానీ, తమనుగానీ తీసుకెళ్ళాలని చంద్రబాబుకు సూచించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు ఫోన్ చేసి ‘హోదా’పై తాజా పరిణామాలను వివరించారు. పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించటానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయటానికి రాహుల్ సోమవారం ఏపీకి చెందిన రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇక వైసీపీకూడా కాంగ్రెస్ తరహాలోనే అవకాశం దొరికింది కదా అని టీడీపీపై రెచ్చిపోయింది. ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలు టీడీపీ ఎంపీల బట్టలూడదీస్తారని వైసీపీ నేత బొత్స ఘాటుగా వ్యాఖ్యానించారు. జేసీ వ్యాఖ్యలపై బాబు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
మరోవైపు ప్రత్యేకహోదాకోసం కొంతకాలంగా గట్టిగా మాట్లాడుతున్న సీపీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇవాళ కార్యాచరణలోకికూడా దిగిపోయింది. శ్రీకాకుళంనుంచి ఇవాళ బస్సుయాత్ర ప్రారంభించింది. ఇది అనంతపురంజిల్లా హిందూపురంవరకు సాగుతుంది. ఈనెల 11వరకు ఈ బస్సుయాత్ర సాగనుంది. అప్పటికికూడా కేంద్రం ప్రకటన చేయకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆ పార్టీ నాయకుడు రామకృష్ణ చెప్పారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు ఇప్పటికైనా రాజీనామా చేయాలని అన్నారు. ప్రత్యేకహోదాతోబాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్యాకేజిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక హీరో శివాజి ప్రత్యేకహోదా సాధించేవరకు పోరాడతామని, హోదాను వ్యతిరేకించేవారు ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. మొత్తానికి నిన్న ఇంద్రజిత్‌సింగ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేడిని పుట్టించింది. ఇది ఎంతవరకు వెళుతుందీ, ఏమి సాధిస్తుందీ, హోదా సాధన రేసులో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది వేచి చూడాలి.