రాజాకీయాలు ఒక మహా ప్రవాహం వంటివి. అందులో ఈదులాడుతున్నవారు..వాటిపై కాస్తో కూస్తో ఆసక్తి చూపేవారు కూడా అందులో కొట్టుకుపోతూనే ఉంటారు. ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది..దానికి ప్రతిక్రియలు వేరేక్కడో కనబడతాయి. వాటి గురించి ఆలోచించేలోపుగానే మరెక్కడో ఏదో జరిగిపోతుంది. అప్పుడు ఆ పాత విషయం పక్కన పడేస్తాము. కొత్తదాని గురించి ఆలోచనలు, క్రియలు, ప్రతిక్రియలు మొదలవుతాయి. మళ్ళీ మరొకటి..ఆ తరువాత ఇంకొకటి..ఇంకొకటి…ప్రవాహమే..ఆ ప్రవాహంలో పడి ఉక్కిరిబిక్కిరి అవుతూ దేని గురించి పూర్తిగా ఆలోచించే అవకాశం ఎవరికీ ఉండదు.
“తెదేపా ప్రభుత్వాన్ని కూల్చడానికి గంట సేపు పట్టదు” అని రాజ్ భవన్ దగ్గర జగన్ అన్న వెంటనే రాజకీయాలు ఉరకలెత్తి ప్రవహించాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపులు…జగన్ డిల్లీ పర్యటన..తెదేపా విమర్శలు..జగన్ దీక్ష ప్రకటన..చంద్రబాబు కేంద్రానికి లేఖ..కేసిఆర్ పులి ఘర్జనలు…హోదా కోసం కెవిపి బిల్లు…దానిపై కేంద్రం స్పందన..మళ్ళీ దానిపై రాష్ట్రంలో పార్టీల స్పందన.. తెదేపా, భాజపాల పొత్తులపై చర్చలు..ఇలాగ ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. అప్పుడు వాటిలో మొదట చాలా సీరియస్ అనుకొన్న విషయం ఆ ప్రవాహంలో కనబడకుండా కొట్టుకుపోతుంది. దాని స్థానంలో మరొకటి..మరొకటి వచ్చి చేరూతూనే ఉంటాయి.
ఇప్పుడు కాస్త ఆగి వెనక్కి తిరిగి చూసుకొన్నట్లయితే, ఆనాడు వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి మొదలయిన చర్చ, అవిశ్వాస తీర్మానాలు, అనర్హత వేటులు, రోజా కేసు, లోకేష్ మంత్రి పదవి ఇలాగ చాలా విషయాలు మూలనపోగుపడి కనబడతాయి.
ఈ ప్రవాహం ఇదే వేగంతో కొనసాగితే బహుశః తెలంగాణా ప్రాజెక్టులపై అభ్యంతరాలు కూడా మూలకి చేరవచ్చు. వాటి స్థానంలో తెదేపా, భాజపాల పొత్తులపై చర్చలు, అవి తెగతెంపులు చేసుకొంటే ఏమవుతుంది..చేసుకోకపోతే ఏమవుతుంది అనే ముచ్చట్లు మొదలవవచ్చు. తెగతెంపులు చేసుకొంటే ఆ రెండు పార్టీల నేతల తిట్లు, విమర్శలనే వార్తలుగా వ్రాసుకొంటూ చదువుకొంటూ కాలక్షేపం చేయవలసి ఉంటుంది లేకుంటే ఆ రెంటినీ ప్రతిపక్షాలు తిట్టే తిట్లు, విమర్శల గురించి వినవలసి ఉంటుంది.
ఈలోగా పుణ్యకాలం పూర్తయిపోతుంది. ‘గొంగళీ ఎక్కడ ఉన్నావే…అంటే వేసిన చోటనే కదలకుండా పడి ఉన్నాను,” అని జవాబు వినిపిస్తుంది. దాని పేరు ఆంధ్రప్రదేశ్. అది ఐదేళ్ళుగా అక్కడే ఎందుకు ఉండిపోయిందో మన రాజకీయ నేతలు వివరించి చెప్పి, మనల్ని చైతన్య పరచడానికి గుంపులు గుంపులుగా వస్తారు. వారిలో అందరికంటే మనకి బాగా నచ్చ చెప్పగలిగినవాడినే మళ్ళీ మన భుజాలకి ఎక్కించుకొంటాము. అప్పుడు మనం పట్టువదలని విక్రమార్కుడు పాత్రలోకి ప్రవేశిస్తాము కనుక మన భుజాల మీద ఉన్న రాజకీయ నాయకులు భేతాళుడి పాత్ర పోషించడం సహజం. మళ్ళీ మరో ఐదేళ్ళ పాటు ఆ భేతాళుడు చెప్పే కధలన్నిటికీ మనం ‘ఊ’ కొడుతూ సమాధానాల కోసం ఆలోచిస్తూ నడుస్తూనే ఉంటాము. గొంగళి అక్కడే పడి ఉంటుంది.