ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కొత్త తరహ రాజకీయం కనిపిస్తోంది. వైసీపీ హాయాంలోని మంత్రుల వ్యవహారశైలికి భిన్నంగా ప్రస్తుత మంత్రులు వ్యవహరిస్తున్నారు. తమ శాఖలపై సమీక్షలతో మంత్రులంతా బిజీ అయిపోతున్నారు. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీనికంతంటికి చంద్రబాబు ప్రజాస్వామిక విధానాలే కారణంగా తెలుస్తోంది.
వైసీపీ హాయాంలో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రులు తమ శాఖలపై సమీక్షలు చేయాలంటే జగన్ రెడ్డి లేదా సజ్జల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తమ శాఖలోని బదిలీలు, పోస్టింగులు అన్ని సకల శాఖమంత్రిగా పేరున్న సజ్జల హ్యండోవర్ లోనే జరిగేవి. ఈ విషయాన్ని జగన్ కు చెప్పుకోవాలని ప్రయత్నించినా.. సజ్జలకు జగన్ ఇచ్చే ప్రాధాన్యత చూసి వారు ఆగిపోయారన్న వాదనలు ఉన్నాయి. అదే సమయంలో శాఖలపై ఫోకస్ పెట్టడానికి బదులుగా ఎక్కువగా రాజకీయ అంశాలపైనే చర్చించడం, మాట్లాడటం వారికీ ఈ ఎన్నికల్లో శరాఘాతం అయింది. జగన్ కేబినెట్ లో ఒక్క పెద్దిరెడ్డి మినహా అందరూ ఓటమి చవిచూశారు.
ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వ హాయాంలోని మంత్రుల్లా కాకుండా ప్రస్తుత మంత్రులు రాజకీయ అంశాలపై కాకుండా సమస్యల పట్ల స్వేచ్చగా మాట్లాడుతున్నారు. ఇటీవల అచ్చెన్నా తన శాఖపై సమీక్ష చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించగా.. వంగలపూడి అనిత గంజాయి నియంత్రణపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాజాగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గోదాములను , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆసుపత్రులను తనిఖీ చేశారు.
వైసీపీ హాయాంలో మంత్రులు సమీక్షలు చేయాలంటే ఆంక్షలు ఉండేవి, కానీ కూటమి సర్కార్ కొలువుదీరాక మంత్రులు మాత్రం తమ శాఖలపై ఎవరి అనుమతి లేకుండానే సమీక్షలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీలో ప్రజాస్వామిక పాలనకు అంకురార్పణ జరిగిందంటూ ఈ అంశాలను ఉదాహరిస్తున్నారు.