ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఏపీ ఎన్నికలు చెదురుముదురు ఘటనలతో ముగిశాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం లంక గ్రామంలో వైసీపీ శ్రేణులు – టీడీపీ పార్టీ వర్గీయులు బాహాబాహీకి దిగాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు.
అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం బెస్తరపల్లిలోనూ టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడంతో ఈ ఘటనలో టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాలకు చెందినా వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ , వైసీపీ నేతల ఇళ్ళపైన కూడా రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది.
ఉదయం 7 గంటలకు మొదలు కాగా, సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో గతం కన్నా అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతంపైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదు కానున్నట్లు తెలుస్తోంది. ఆరు గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉండటంతో 7౦ శాతం పోలింగ్ నమోదు కానున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన పోలింగ్ శాతం టీడీపీకి అనుకూలంగా ఉంటుందని టీడీపీ బలంగా చెప్తుండగా.. వైసీపీ కూడా ఆ ఓటు శాతం తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ , నూతన ఓటర్లు అంతా టీడీపీ వైపే మొగ్గు చూపారనే వాదనలతో వైసీపీలో ఆందోళన వ్యక్తం అవుతోంది.