కరెంట్ ఉత్పాదకతలో స్వయం సమృద్ధి సాధించాం. ఇక విద్యుత్ రేట్లు పెంచేది లేదు. కుదిరితే తగ్గిస్తాం.. అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పేవారు. ఆయన హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసేవారు. విద్యుత్ ఒప్పందాల్లో విపరీతమైన దోపిడీ అని కల్లాం అజేయరెడ్డి లాంటి వారితో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కించారు. సీఎం కాగానే ప్రమాణస్వీకార వేదిక మీద నుంచే … విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి చార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని జగన్ ప్రకటించారు. ఆయన హావభావాలు చూసి జనం కరెంట్ చార్జీలు తగ్గిపోతాయనుకున్నారు. కానీ మూడేళ్లలోనే రెట్టింపు అయిపోయాయి. ఇంత కాలం ట్రూ అప్ చార్జీలని.. మరొకటని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఏప్రిల్ నేరుగా వడ్డించేసింది.
ఈ పెంపు కూడా కనికరం లేకుండా పెంచేశారు. నెలకు 30 యూనిట్లు వాడుకునే వారినీ వదల్లేదు. 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచారు. అంటే దాదాపుగా ప్రతి ఇంటికి రెట్టింపు కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. పెంపు నిర్ణయాన్ని ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ చార్జీలపెంపు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు విద్యుత్ చార్జీలు కూడా అత్యధికం అయితే.. ద్రవ్యోల్బణం కూడా ఏపీలోనే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ధరలు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోకి రాక ముందు సీఎం జగన్ చెప్పే దానికి.,. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దానికి పొంతన లేకపోవడంతో ప్రజలు కూడా నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే అనేక రకాల పన్నుల వడ్డించగా తాజాగా కరెంట్ షాక్ ఇవ్వడంతో ప్రజలపై కోలుకోలేని భారం పడే అవకాశం కనిపిస్తోంది.