సాక్షిలో జర్నలిస్టుగా చేస్తూ ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి పొందిన కొమ్మినేని శ్రీనివాసరావు తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందన్నారు.
2022 నవంబర్ 10వతేది న తాము చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టానని 13 నెలల 15 రోజులు కాలం అధికారంలో ఉన్నానన్నారు. ఇప్పుడు రాజీనామా లేఖ ఇచ్చానని.. సంక్రాంతి సెలవులు ఉన్నందున తర్వాత వర్కింగ్ డే నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. కొమ్మినేని హఠాత్తుగా రాజీనామా చేయడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి కసురుకున్నా.. సరే సార్ అని సర్దుకుపోయే మనస్థత్వం ఉన్న కొమ్మినేని.. విధానాలు నచ్చకో.. నిర్ణయాలు నచ్చకో రాజీనామా చేసే టైపు కాదు. మరి ఎందుకు రాజీనామా చేశారన్నది గోప్యంగానే ఉంచారు.
బహుశా ఆయనకు పదవి ఇచ్చి దండగ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ సందర్భంలో అయినా కసురుకుని ఉంటారని అందుకే ఆయన ఫీలై ఉంటారని చెబుతున్నారు. లేకపోతే ఎన్నికల సర్దుబాట్లలో భాగంగా ఎవరికైనా ఆ పదవి సర్దుబాటు చేసేందుకు రాజీనామా చేయించి ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. నిజమేంటో బయటకు రావాల్సి ఉంది.