ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చట్టం, న్యాయం ఏమీ లేకుండా ప్రజల్ని పీడించుకుతింటున్న పోలీసుల కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇందులో దళితులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు పోలీసులపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. హోంమంత్రి వనిత నియోజకవర్గంలో జరిగిన ఘటనలే దీనికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
హోంమంత్రి వనిత నియోజకవర్గంలో ఓ వైసీపీ జడ్పీటీసీ సమీప బంధువు అయిన యువకుడిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. వైసీపీలోని మరో వర్గం వారు తమ ఫ్లెక్సీలను మహేంద్ర అనే యువకుడు కత్తిరించాడని ఫిర్యాదు చేశారు. కేసు లేకుండా ఏమీ లేకుండా పోలీసులు మహేంద్రను తీసుకెళ్లారు. చితక్కొట్టారు. వైసీపీ జడ్పీటీసీ బందువు అయినా వినలేదు.. ఆ జడ్పీటీసీ హోంమంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదు. కొట్టి… అవమానించి వదిలి పెట్టడంతో ఆ యువకుడు కలుపు మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.
ఈ ఘటన కొవ్వూరులో దళిత వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. మృతదేహం వద్ద పెద్ద ఎత్తున దళితులు గుమికూడటం.. ఆందోళన ప్రారంభించడంతో బందోబస్తు కోసం పోలీసులువచ్చారు. వారందర్నీ దళితులు తరిమికొట్టారు. రాళ్లతో కొట్టారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. తర్వాత ఆ మృతదేహాన్ని హోంమంత్రి దగ్గరకు తీసుకెళ్లాలనుకున్నారు. వారి ఆవేశం చూసిన పోలీసులు వెంటనే హోంమంత్రిని వేరో చోటుకు వెళ్లిపోవాలని సూచించారు. దాంతో ఆమె వెళ్లిపోయారు. కోపంతో ఆమె కాన్వాయ్ లోని రెండు కార్లను దళిత వర్గాలు ధ్వంసం చేశాయి.
నిజానికి ఇలా పోలీసుల బాధితుడు…మహేంద్ర మొదటి వ్యక్తి కాదు. కొన్ని వేల మంది ఉన్నారు. వారిలో చీరాల కిరణ్.. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇంత కాలం వారిని కట్టడి చేశారు. ఇప్పుడు వారిలో ఆవేశం కట్టలు తెంచుకునే పరిస్థితి వస్తుంది. మిగతా వర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తే.. పోలీసులకు సానుభూతి కూడా లభించదు. ఎందుకంటే వారు రక్షకులు కాకుండా భక్షకులకుగా మారి నాలుగున్నరేళ్లు అవుతోంది మరి !