రాష్ట్రం విడిపోయాక ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ అప్పు మరో 30 వేల కోట్ల రూపాయలు పెరిగి మొత్తం 94 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇదే మొత్తం మీద వచ్చే పదేళ్ళలో వడ్డీ (మాత్రమే) 80 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుంది.
విభజన చట్టప్రకారం పోలవరం ప్రాజెక్టుకి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, కేంద్రప్రభుత్వమే నిధులు ఇవ్వవలసి వుంది. బడ్జెట్ లో లోటును కేంద్రమే పూరించవరసి వుంది. పోలవరం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసిన 5 వేల కోట్ల రూపాయలు, బడ్జెట్ లోటు 16 వేలకోట్ల రూపాయలు కేంద్రం ఒకేసారి ఇచ్చి వుంటే ఇంత రుణభారం ఆమేరకు వడ్డీ భారం పెరిగేది కాదు.
ఈ వారంలో తాజాగా 1500 కోట్ల రూపాయలు అప్పు చేసిన సందర్భంలో ఆర్ధిక శాఖ ముఖ్యమంత్రికి పంపిన నోట్ లో వివరాలు ఇలా వున్నాయి.
రాజధాని నిర్మాణం..రైతు రుణమాఫీ, ఎన్నికల హమీలు, సంక్షేమ పథకాల అమలు.. కేంద్రం ఆర్ధిక లోటుని పూరించకపోవడం మొదలైన కారణాల వల్ల ఎపి అప్పుల్లో కూరుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉద్యోగుల జీతాలు, చివరికి సాధారణ పాలనా అవసరాల కోసం పరిమితికి మించి అప్పులు చేయక తప్పడం లేదు.
విభజన జరిగిన 2014 జూన్ రెండో తేదీ వరకు రెండు రాష్ట్రాల మధ్య 1.17 లక్షల కోట్ల వరకు మార్కెట్ రుణాలు ఉండగా, అందులో జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 48 వేల 786 కోట్ల రూపాయలు, ఆంధ్రాకు 68 వేల 263 కోట్ల రూపాయల పంపకాలు జరిగాయి.
విభజన అనంతరం రాష్ట్రప్రభుత్వం ఆర్థిక లోటు, ఇతర అవసరాల దృష్ట్యా 2016 మార్చి వరకు మరో 29 వేల 50 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది…దీంతో మొత్తం రుణం 97వేల 313 కోట్ల రూపాయలకు చేరుకుంది…ఇందులో మార్చి వరకు 3 వేల 710 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 1, 796 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఈ చెల్లింపుల్లో అప్పు 91 వేల 908 కోట్ల రూపాయలకు తగ్గగా, తాజాగా మే, జూన్ నెలల్లో పదిహేను వందల కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయడంతో మళ్లీ రుణభారం మళ్ళీ 94 వేల 908 కోట్ల రూపాయలకు చేరింది.
అప్పులపై రాష్ట్రానికి 7 నుంచి 8 శాతం వడ్డీభారం పడుతోంది. చట్టప్రకారం రావలసిన నిధుల్లో కేంద్రం ఒక శాతం కూడా విడుదల చేయడం లేదు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ రుణాల నుంచి ఎప్పటికైనా బయట పడుతుందా అన్నది అనుమానమే.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు రొటీన్ గా రావలసిన వాటాల ప్రకారమే నిధులు వస్తున్నాయి. వాటిని ఆయా పద్దులకే ఖర్చు చేయాలి. ప్రత్యేక హోదా గురించి అడిగినపుడల్లా వేల కోట్ల రూపాయల రొటీన్ నిధుల గురించే బిజెపి నాయకులు లెక్కలు చెబుతూంటారు. పైగా (సోషల్ మీడియాలో)ప్రశ్నించిన వారి మీద కిలో మీటర్లకొద్దీ కోపాలు చూపిస్తూంటారు.
రాష్ట్రాలకు రొటీన్ గా ఇవ్వవలసిన రొటీన్ వాటాలనే బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇస్తూ తాము బ్రహ్మాండంగా ఉద్దరించేస్తున్నామన్న బిల్డప్ ఇస్తోంది. వెంకయ్యనాయుడు కోటాకు మించిన ఇళ్ళను ఎపి క ఇచ్చారన్నది వాస్తవమే! నితిన్ గడ్కరీ రహదారులకు 20 వేల కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారన్నదీ వాస్తవమే!
ఈ లెక్కన నిధులు ఇస్తే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఉమాభారతి ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినది కూడా వాస్తవమే!!
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ”అప్పుల అప్పారావు”అయిపోయింది…కేంద్రప్రభుత్వం చెయ్యి అందించక పోవడం వల్ల అప్పుల ఊబిలోకి మరింతగా కూరుకుపోతోంది.