భారత రాష్ట్ర సమితి ఆలోచన కేసీఆర్ చేసిన తర్వాత ఏపీ నుంచికూడా ఆయనకు కొంత సానుకూలత కనిపిస్తోంది. ఏపీ నుంచి కొంత మంది రెడ్డి నేతలు హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ నాయకత్వం ఏపీకి కూడా కావాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పేరుతో సొంతంగా దుకాణం పెట్టుకున్న పెల్లకూరు సురేంద్రరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఆయనకు తెలంగాణ మీడియా మంచి కవరేజీ ఇచ్చింది.
మోదీ సర్కారు ఏపీనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నదని, దీనిపై ప్రశ్నించే నేతలు తమవద్ద లేరని అన్నారు. బీజేపీని ఎదిరించే ఏకైక మొనగాడు కేసీఆర్ అనిచెప్పుకొస్తున్నారు.కేంద్రం వివక్షపై పోరాడే నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ప్రస్తుత ఏపీ సీఎం అలా పోరాడటం లేదని సురేంద్రరెడ్డి చెబుతున్నారు. ఆ ధైర్యం సీఎం కేసీఆర్‌లో ఉన్నదని, ఆయన నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని అంటున్నారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. ఏపీ వాయిస్ కేంద్రంలో బలంగా వినిపించాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని అంటున్నారు.
ముందు ముందు ఏపీ నుంచి ఇలాంటి నేతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి కేసీఆర్ నాయకత్వం కావాలని అడిగేవారు.. పెరుగుతారని… ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లు పెట్టినా.. త్వరలో ఏపీలో ర్యాలీలు కూడా నిర్వహిస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి ఏపీ అంటే.. రాజకీయాల్లో అందరికీ చులకన అయిపోయిందన్న అభిప్రాయం.. ఇలాంటి స్వయం ప్రకటిత నేతల వల్లే వస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.