ఏపీలో మూడు రాజధానులు వ్యవహారం చివర దశకు చేరుకుంటోంది. ఒక పక్క ఆందోళనలు కొనసాగుతూనేవున్నా ముఖ్యమంత్రి జగన్ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నారు. హైపవర్ కమిటీ పని కూడా పూర్తి కావొస్తోంది. 20వ తేదీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమరావతిలో ఆందోళనలు, వివిధ పార్టీల నేతల చర్చలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, రకరకాల వాదాలు ప్రతివాదాలు…ఇలాంటి పరిణామాల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున మూడు రాజధానులంటూ మాట్లాడిన జగన్ ఇప్పటివరకు నోరు విప్పలేదు. కేబినెట్ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీలో ఏం ప్రకటిస్తారు? మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుంది? ..ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏపీ ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
మూడు రాజధానుల వ్యవహారం దేశమంతా ఆసక్తి రేకెత్తిస్తోందని చెప్పొచ్చు. వైకాపా నాయకుల వాదనలు, ప్రకటనలు చూస్తుంటే మూడు రాజధానులు చేయడం చిటికెలో పని అన్నట్లుగా ఉంది. రాజధాని మార్పును ఎవరూ ఆపలేరని వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. కాని మూడు రాజధానులు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని, చాలా అడ్డంకులు ఉన్నాయని ఈ కాన్సెప్టును వ్యతిరేకించేవారు చెబుతున్నారు. ఎవరి కోణంలో వారు తమదే సరైన వాదన అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వైకాపాకు బండ మెజారిటీ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకునే అధికారముంటే వచ్చే ప్రభుత్వాలు కూడా అలా చేసుకోవచ్చు కదా.
కొందరు న్యాయ నిపుణలు చెబుతున్నదాని ప్రకారం పార్లమెంటులో రాష్ట్ర విభజన (పునర్వ్యవస్థీకరణ) చట్టాన్ని సవరించనిదే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దాని ప్రకారమే రాజధాని నిర్ణయమైంది. అలాంటప్పుడు విభజన చట్టాన్ని సవరించకుండా మూడు రాజధానులు చేయడం ఎలా సాధ్యం? పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీలో కలిపింది. అప్పుడు విభజన చట్టాన్ని సవరించింది. కొంతకాలం కిందట కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సిఎఎ). మూల చట్టానికి సవరణ చేయందే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదు.
కాబట్టి కొత్తగా ఒక పని చేయాలంటే మూల చట్టానికి సవరణ చేయాలి. మరి ఈ విషయం జగన్ ప్రభుత్వానికి తెలియదా? బీజేపీ నాయకులకు తెలియదా? పార్లమెంటులో విభజన చట్టానికి సవరణ చేయడం, దాన్ని ఆమోదించడం సులభమేనా? రాజధానిని విభజించాలనుకుంటే అది విభజన చట్టానికి లోబడి మాత్రమే జరగాలి. హైకోర్టును కర్నూలుకు తరలించడం, దానికి అమరావతిలో, విశాఖలో బెంచీలు ఏర్పాటు సాధ్యం కాదని న్యాయ నిపుణులు కొందరు చెబుతున్నారు. హైకోర్టును తరలించాలన్నా విభజన చట్టాన్ని సవరించాల్సిందే. పైగా ఇందులో సుప్రీం కోర్టు ప్రమేయం కూడా ఉంది.
విభజన చట్టంలోని 31(2) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏర్పడిన అమరావతిలో నెలకొల్పిన హైకోర్టును వేరే నగరంలో ఏర్పాటు చేయడం, ఇతర ప్రాంతాల్లో ధర్మసనాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను చేయలేదు. ఇక టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసినా, సవరించినా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏను రద్దు చేసి విజిటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అభివృద్ధి సంస్థ) ను పునరుద్ధరిస్తుందని వార్తలు వచ్చాయి. ఇది కూడా కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మూడు రాజధానుల ఆలోచన చేసిన జగన్ దీని వల్ల వచ్చే న్యాయపరమైన వివాదాల గురించి, చట్టపరమైన ఇబ్బందుల గురించి కసరత్తు చేయకుండా ఉండరు. మరి మూడు రాజధానులు ఎలా సాధ్యం చేస్తారో చూడాలి.