ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదయింది. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుంది. కరోనా వైరస్ సోకిన కారణంగా .. 55 ఏళ్ల ఓ వ్యక్తి సోమవారమే మృతి చెందాడు. అయితే.. అతనికి కరోనా ఉందో లేదో తెలుసుకునే సరికి మూడు రోజులు పట్టిందని.. ప్రభుత్వం తెలిపింది. అతనికి కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులున్నాయని..ఏ కారణంగా చనిపోయాడో తెలుసుకోవడానికే.. ఆలస్యమయిదని అధికారులు చెబుతున్నారు. అన్ని వివరాలు తెలిసిన తర్వాత అధికారికంగా ధృవీకరిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. మృతుని కుమారుడు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అతనికి మార్చి 30వ తేదీన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఆయన ద్వారా.. ఆయన తండ్రికి వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. మృతుని కుమారుడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దేశంలో ఒకే రోజు.. పన్నెండు మంది కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఇది కరోనా కేసులు భారత్‌లో బయటపడిన తర్వాత అత్యధికం. మొత్తంగా ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారు 74మంది. తెలంగాణలో ఈ సంఖ్య 9.
మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు… భారీగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం 2640కి చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మరో వారం రోజుల్లో పదివేలకు చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు.. వారితో కాంటాక్ట్ లో ఉన్న వారికే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.