కొత్త రాజధానికి ఏపీ సర్కార్ చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. విభజన చట్టంలో భాగంగా ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉంటుంది. అందుకే.., పదిహేనో ఆర్థిక సంఘం ద్వారా.. ఈ నిధులను కేటాయించాలని కోరుతూ.. లేఖ పంపింది. ఇప్పటికి కేంద్రం ఏపీ రాజధాని కోసం రూ. 1500 కోట్లు ఇచ్చింది. అయితే.. అవి సరిపోవని.. న్యాయవ్యవస్థ భవనాలకు రూ. 1849 కోట్లు, శాసన వ్యవస్థ భవనాలకు రూ. 1397 కోట్లు, పరిపాలనా వ్యవస్థ కోసం రూ. 5099 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఇచ్చినట్లుగా చెబుతున్న రూ. 1500 కోట్లను అమరావతిలో ఖర్చు చేశారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ అడుగుతున్న నిధులను ఏ రాజధానిలో ఖర్చు పెడతారన్న విషయాన్ని ప్రతిపాదనల్లో ఏపీ ప్రభుత్వం పంపలేదు.
మూడు రాజధానుల విషయంలో తమకేమీ సంబందం లేదని కేంద్రం చెబుతోంది. ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే.. కేంద్రం తాము గుర్తించిన రాజధాని అమరావతికి ఇప్పటికే నిధులిచ్చింది. చంద్రబాబు హయంలోనే ఇంకా వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ అవి ఇవ్వలేదు. కొత్త సర్కార్ మారిన తర్వాత వాటి గురించి అడగలేదు. ఇప్పుడు మూడు రాజధానులు కట్టుకున్నా అది రాష్ట్రం ఇష్టమేనని కేంద్రం అంటోంది. అయితే విభజన చట్టం ప్రకారం.. రాజధానులకు కేంద్రం సాయం చేయాల్సిందే. ఈ అంశాన్నే ఉపయోగించుకుని పదిహేనో ఆర్థిక సంఘం ద్వారా.. ఏపీ సర్కార్ నిధుల ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తోంది.
అయితే.. పదిహేనో ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఒక్క రాజధాని కోసమే కాదు.. మొత్తం ఏపీకి కావాల్సిన నిధుల వివరాలతో ఓ నివేదికను కొత్తగా పంపినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అందులో వచ్చే ఐదేళ్లకు కనీసం రూ. 9లక్షల కోట్ల సాయం కావాలని ప్రభుత్వం అడిగింది. అంటే.. ఏపీ సర్కార్ బడ్జెట్ ఎంత ఉందో.. ఏడాదికి అంతే మొత్తం ఆర్థిక సంఘం నిధుల రూపంలో కావాలని కోరుతోందన్నమాట. మరి ఆర్థిక సంఘం ఎంత మేర దయతలచి ఇస్తుందో చూడాలి..!