ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి ఇంకా సాయం అందాలనీ, ఆశించిన స్థాయిలో రాలేదనీ, రావాల్సింది చాలా ఉందనీ… ఇలా ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అంటుంటారు. రాష్ట్రంలో ఆదాయం లేదనీ, రెవెన్యూ లోటు చాలా ఉందని లెక్కలు చెబుతూ ఉంటారు. అయితే, కేంద్రంలోని భాజపా సర్కారు మాటలు మరోలా ఉంటున్నాయి. ఆంధ్రా రెవెన్యూ లోటుకు సంబంధించి కేంద్రం చెప్తున్న లెక్కలు ఒకలా ఉంటే… చంద్రబాబు సర్కారు చూపించే అంకెలు మరోలా ఉంటున్నాయి. రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుదల చేయాల్సింది మరో రూ. 138 కోట్లు మాత్రమే అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు! అంటే, ఇప్పటికే చాలా లోటు భర్తీ చేసినట్టు.. ఇది కూడా ఇచ్చేస్తే ఇవ్వాల్సింది ఇచ్చేసినట్టే అని చెప్పకనే చెబుతున్నట్టు.
కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రా రెవెన్యూ లోటు రూ. 4117 కోట్లు. దీన్లో ఇప్పటికే కేంద్రం ఏపీకి అందించిన సాయం రూ. 3979 కోట్లుగా ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఇక, మిగిలింది 138 కోట్లు మాత్రమేననీ, దాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తున్నామని, ఏపీ సర్కారుకు ఇదే మాట చెప్పారని తెలుస్తోంది. అయితే, దీంతో ఇన్నాళ్లూ ఏపీ రెవెన్యూలోటు గురించి చంద్రబాబు సర్కారు చెబుతున్నది నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, చంద్రబాబు ఎప్పటికప్పుడు పదహారు వేల కోట్ల లోటు ఉందని చెబుతుంటారు. కానీ, కేంద్రం లెక్కల ప్రకారం ఆ లోటు నాలుగు వేల కోట్ల పైచిలుకే!
కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందడం లేదని చంద్రబాబు ఎప్పటికప్పుడు వాపోతూ ఉంటారు. కానీ, అరుణ్ జైట్లీ మాటలు చూస్తుంటే ఏపీకి ఇవ్వాల్సినదంతా ఇచ్చేశామనీ, రెవెన్యూ లోటు తీర్చేశామని అన్నట్టుగా చెబుతున్నారు. ఈ తరుణంలో ఎవరి ప్రకటనలు నమ్మాలి..? ఇంతకీ ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు ఎంత..? కేంద్రం చెబుతున్నట్టు రూ. 4 వేల కోట్లా… చంద్రబాబు చెబుతూ ఉన్నట్టుగా రూ. 16 వేల కోట్లా..? ఇన్నాళ్లూ చంద్రబాబు చెప్పినవి కాకి లెక్కలా..? ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తే కేంద్రంపై టీడీపీ అసంతృప్తి ఎందుకు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఆంధ్రాలో భాజపాని విస్తరించే పనులను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాకి కేంద్రం చేసిన సాయాన్నే భాజపా ప్రముఖంగా ప్రచారం చేసుకుంటుంది. సో… ఆంధ్రా రెవెన్యూ లోటు మొత్తాన్ని భర్తీ చేసేశామని కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఈ లెక్కలపై ఇప్పటికైనా టీడీపీ సర్కారు అసలు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి.