రాజకీయం తీరెరుగదు – పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదంటారు…! ఇదెంత నిజమో కానీ.. భయపెట్టి పాలన సాగించేస్తున్నారని.. ఎవరు నోరెత్తినా కేసులు.. అరెస్టులు.. దాడులు.. దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తెర ముందుకు ముందుకు వచ్చి గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల్ని ఎవరు భయపెట్టినా ఊరుకోబోమని… కఠినంగా అణిచివేస్తామని .. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదంతా తమ గురించి కాదు.. ప్రతిపక్ష నేతలు.. మీడియా గురించే. కరోనా గురించి చెప్పి.. చెప్పి ప్రజల్ని భయపెడుతున్నారట. అందుకే తాట తీయడానికి సిద్ధమవుతున్నారట.
రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు… కేసులు ఎన్నయినా పెట్టుకోవచ్చు. భయపెడుతున్నారని కాకపోతే.. వైరస్ వాళ్లే సృష్టించారని కేసులు పెట్టుకోవచ్చు. కావాలంటే.. ఎంత మందిని కావాలంటే అంత మందిని బొక్కలో వేసుకోవచ్చు. ఇప్పుడు.. చేస్తుంది కూడా అదే. చట్టం.. రాజ్యాంగం ఏవీ లేకుండానే… ఎవర్ని కావాలంటే వారిని అరెస్ట్ చేసేస్తున్నారు. రేపు ప్రజల్ని భయపెట్టేశారని కూడా ఎవర్నైనా బొక్కలో వేసుకోవచ్చు. వాళ్లే.. ఓ ఐదు రోజులో.. పది రోజుల్లో జైల్లో ఉంటారు. కరోనా అంటించుకుంటారు. వారికి ఆ మాత్రం భయం ఉండాల్సిందే.
చూడ్డానికే భయపడే రూపంలోనే ఉండే మంత్రులు ఈ ప్రకటనలు చేస్తూ.. మరింత భయపెడుతున్నారు. ఓ వైపు ప్రజల్ని భయపెడుతున్నారంటూ… ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలకు సమాచారం చెబితే అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కఠిన చర్యలకు సిద్ధమయ్యామని లాఠీలు ఝుళిపిస్తామనికూడా చెబుతున్నారు. ఇవన్నీ ఎందుకంటే.. ప్రజల్ని భయపెడుతున్నందుకేనట. అసలు ప్రజల్ని భయపెడుతోంది కరోనా. ప్రభుత్వాన్ని కూడా ఆ కరోనానే భయపెడుతోంది. అంతగా పట్టుదల ఉంటే.. ఆ కరోనానే బొక్కలో వేయవచ్చు కదా సారూ.. అని సామాన్యులు.. కాస్త తెలివిగానే అడుగుతున్నారు. కానీ భయకంపిత మంత్రులు.. ప్రభుత్వం వద్ద సమాధానాలుంటాయా అనేదే క్వశ్చన్.