పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తెలుగుదేశం పార్టీపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనిఫెస్టోను ముద్రించినట్లుగా క్లెయిమ్ చేసుకున్న టీడీపీ కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేనిఫెస్టో అంశంపై వైసీపీ మూడు రోజులుగా విమర్శలు చేస్తోంది. తాము ఫిర్యాదు చేయబోమని… సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే… తర్వాత ఏమనుకున్నారో కానీ.. వైసీపీ లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఈసీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి రెండో తేదీ లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
లేకపోతే ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజునే… చంద్రబాబునాయుడు పల్లె ప్రగతి – పంచ సూత్రాలు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీల గుర్తుల పరంగా జరగని ఎన్నికలకు ఇలా మేనిఫెస్టో విడుదల చేయడం… నిబంధనలకు వ్యతిరేకమని వైసీపీ వెంటనే విమర్శలు ప్రారంభించింది. అయితే గతంలోనూ తాము మేనిఫెస్టోలు విడుదల చేశామని టీడీపీ వాదిస్తూ వస్తోంది.
చివరికి ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేయడాన్ని ఎస్ఈసీ తప్పు పడుతోంది. ఇప్పుడు ఎస్ఈసీకి టీడీపీ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరస్థితి. ఒక వేళ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే.. తదుపరి చర్యలు తీసుకుంటారు. సహజంగా ఎన్నికల కమిషన్ మరోసారి అలాంటి తప్పు చేయవద్దన్న హెచ్చరికలతో సరి పెడుతుంది. పదే పదే చేస్తే… తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ విషంయలో నిమ్మగడ్డ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.