మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. గతంలో కోర్టు వివాదాల కారణంగా మిగిలిపోయిన వాటికి ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ సహా మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. పంచాయతీ వార్డులకు ఈనెల 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్ జరిపేందుకు నిర్ణయించారు. 17వతేదీ కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 16న పోలింగ్, 18న కౌంటింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో మున్సిపాల్టీలు, నగర కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా.. డివిజన్లు, వార్డుల పునర్విభజన విషయంలో ప్రతిపక్షాలు కోర్టుకెక్కడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. తాజాగా.. కోర్టు కేసులు క్లియర్ కావడంతో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికలు జరగనున్న స్థానాల్లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.