వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించాలని వారి జోక్యాన్ని సహించేది లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనేక చోట్ల వాలంటీర్లు ఓటర్ స్లిప్లు పంచుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో వాలంటీర్ల తీరుపై వివరాలు సేకరించిన ఎస్ఈసీ రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు..ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అభ్యర్థుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని.. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓటర్ స్లిప్పులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని.. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశిచింది.^ వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించింది. వాలంటీర్లపై పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన ఆరోపణలపై.. ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించిన ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించడం కోడ్ ఉల్లంఘనేనని.. కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు సర్క్యూలర్ పంపింది.
నిజానికి వాలంటీర్లను ఎన్నికలకు విధులకు దూరంగా ఉంచాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పుడెవరూ పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసినా నిమ్మగడ్డ స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను కలెక్టర్లు పాటిస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే అధికార పార్టీ వాలంటీర్లను కేంద్రంగా చేసుకునే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది మరి..!