ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. వచ్చే జూన్ లో ప్రొబేషన్ కన్ఫర్మ్ చేసి జూలై నుంచి పెంచిన జీతాలిస్తామని సీఎం జగన్ చెప్పారు. దానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఉద్యోగుల్ని అవమాన పరిచేలా ఉన్నాయి. పరీక్షలు పెట్టామని అరవై వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని …మిగిలిన వారు కూడా పాసైన తర్వాత అందరికీ కలిసి ఒకే సారి ప్రొబేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వారు పరీక్షలు పాస్ కాకపోవడం కారణంగానే ప్రొబేషన్ ఇవ్వడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.
నిజానికి సచివాలయ ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడు వారికి రెండు సార్లు పరీక్షలు ఉంటాయని చెప్పలేదు. రాత పరీక్ష ద్వారా వారిని ఉద్యోగులకు ఎంపిక చేసుకుని.. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ఆ రెండేళ్లు గత సెప్టెంబర్తోనే ముగిసిపోయాయి. అక్టోబర్ నుంచి శాశ్వత ఉద్యోగులుగా మారాల్సి ఉంది. కానీ కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. చివరికి నాలుగు పరీక్షలు,… అని భయపెట్టి … రెండు పరీక్షలను ఫైనల్ చేసింది. అందులోనూ కొంత మంది పాస్ కాలేదని మరోసారి మెలిక పెట్టారు. అయితే ప్రొబేషన్ కోసం మరో పరీక్ష రాయాలని మొదట చెప్పలేదు. కానీ కేవలం.. వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చడం ఇష్టం లేకనే పరీక్షల ప్రస్తావన తీసుకువచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై పూర్తి స్థాయి పని భారం పడింది. ప్రభుత్వ పథకాలన్నీ గ్రామ, వార్డు సచివాలాయాల కేంద్రంగానే నడుస్తాయి. అయితే దానికి తగ్గట్లుగా గౌరవం మాత్రం రావడం లేదు. జీతాలూ దక్కడం లేదు. అత్యంత విలువైన సమయాన్ని తాము కోల్పోయామన్న బాధలో గ్రామ, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికిప్పుపుడు లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది.దాన్ని తట్టుకునే పరిస్థితి లేకనే ఏపీ ప్రభుత్వం వాయిదా వేస్తోంది. కానీ కారణంగా మాత్రం ఉద్యోగుల్నేచూపిస్తున్నారు.