రాజధాని విషయంలో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా జగన్మోహన్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్లో ఎలా ఉంటున్నారని వస్తున్న విమర్శలకు… తన సరికొత్త నిర్ణయంతో చెక్ పెట్టబోతున్నారని .. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సెక్రటేరియట్‌ను… చంద్రబాబు కట్టిన భవనాల నుంచి మంగళగిరికి తరలించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. నాగార్జున యూనివర్శిటీ భవనాలు.. సెక్రటేరియట్‌కు అనుకూలంగా ఉంటాయని.. ఈ మేరకు.. ప్రభుత్వాధినేతగా సన్నిహితంగా ఉండే ఉన్నతాధికారులతో నివేదికలు కూడా రెడీ చేయించినట్లుగా… తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ తమకు దూరం అయిందని.. దానిని మార్చాలని.. ఉన్నతాధికారులే సీఎంకు సలహా ఇచ్చినట్లుగా.. ఆ సలహాను సీఎం పాటిస్తున్నట్లుగా.. ముందుగా ప్రచారం చేసి.. ఆ తర్వాత అసలు ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు.
అమరావతిలో రాజధానిని నిర్మించాలనుకున్న గత ప్రభుత్వం… సెక్రటేరియట్ కోసం కొన్ని భవనాలు నిర్మించింది. ప్రస్తుతం అక్కడి నుంచే పాలన సాగుతోంది. అవి తర్వాత ఇతర అవసరాలకు వాడుకునేలా డిజైన్ చేశారు. అసలు సెక్రటేరియట్‌ను మాత్రం.. విడిగా నిర్మాణం ప్రారంభించారు. పునాదులు కూడా పడ్డాయి. రెండేళ్లలో ఐదు బహుళ అంతస్తుల టవర్లను… సచివాలయం కోసం సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే.. కొత్త ప్రభుత్వం అమరావతి నిర్మాణం మొత్తాన్ని నిలిపివేసింది. వాటిలో అవి కూడా ఉన్నాయి. దాంతో.. ఉన్న సెక్రటేరియట్‌లోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. ఇప్పుడు… ఈ సెక్రటేరియట్ భవనాలు కూడా వద్దని… మంగళగిరికి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు.
అయితే… కేవలం.. హైవే నుంచి దూరం పది కిలోమీటర్ల దూరం అయిందన్న కారణంగా.. సెక్రటేరియట్‌ను తరిలించడం అనేది హాస్యాస్పదంగా ఉంటుందన్న చర్చ ఇప్పటికే ఉద్యోగవర్గాల్లో నడుస్తోంది. సెక్రటేరియట్ తరలింపు వ్యవహారం అంటే ఎంత గందరగోళంగా ఉంటుందో.. నాలుగేళ్ల కిందటే అంతా చూశారని.. మళ్లీ అలాంటి పరిస్థితుల్ని ఎవరూ కోరుకోవడం లేదంటున్నారు. పైగా.. అసలు ఓ లక్ష్యం లేకుండా మార్పు ఆలోచన చేయడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఫలానా చోట.. శాశ్వత సచివాలయం పెట్టాలనుకుంటున్నాం.. అందుకే… తాత్కలికంగా మారుస్తున్నామని చెప్పినా ఓ అర్థం ఉంటుందని అంటున్నారు. తెలంగాణ సచివాలయాన్ని బీఆర్కే భవన్‌కు మార్చారు. ఇప్పుడున్న భవనాలను కూలగొట్టి అదే స్థానంలో కొత్త వాటిని కట్టాలనుకుంటున్నారు. కానీ ఏపీలో .. మార్చాలనుకుంటున్నారు కానీ.. తర్వాత ఏమిటన్నదానిపై … ప్రభుత్వంలోనే క్లారిటీ లేదన్న చర్చ నడుస్తోంది. మరి సర్కార్ ఏం చేయబోతోందో..?