ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ సోకి.. ఇద్దరు ఉద్యోగులు రెండు రోజుల వ్యవధిలో చనిపోయారు. దీంతో సచివాలయం ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిందట.. రెండు వందల మందికి టెస్టులు చేయగా.. యాభై మందికిపైగా కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఒక్క సారిగా ఉద్యోగ వర్గాలన్నీ ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఉన్నతాధికారులు ఎవరూ సచివాలయం వైపు రావడం లేదు. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. లేకపోతే.. హెచ్‌వోడీ కార్యాలయాల్లోనే ఉంటున్నారు.
కానీ ఉద్యోగులు మాత్రం… కార్యాలయాలకు రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. అవకాశం ఉన్న వారందరికీ వర్క్ ఫ్రం హోంకు చాన్సివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతూ.. వ్యవహారాలు చక్క బెట్టి.. వారికి రాజకీయంగా అనుకూలమైన ప్రకటనలు చేసే ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగులు ఒత్తిడి పెంచుతున్నారు. కరోనా పేరుతో గతంలో ఎంతో రాజకీయం చేశారు.. ఇప్పుడు పరిస్థితి పీకల మీదకు వచ్చింది.. కనీసం ఉద్యోగులందరికీ..వర్క్ ఫ్రం హోం అవకాశం ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం… పై స్థాయిలో తమ బాధలు చెప్పుకోవడానికి ఇంకా అవకాశం లభించలేదు.
ఉద్యోగులు ప్రాణాలు ఇప్పుడు రిస్క్‌లో ఉన్నాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా ఎంత విజృంభిస్తున్నా ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటోంది. ఏపీలో ఇంత వరకూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. చివరికి స్కూళ్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు.. ఆఫీసులు మూసివేయడం కానీ వర్క్ ఫ్రం హోం ఇచ్చే ఆలోచన కానీ లేదు. కానీ ఉద్యోగులు చనిపోతూండటంతో … ఏం చేయాలో తెలియక.. ఉద్యోగ సంఘాల నేతలు మథనపడుతున్నారు. మరిన్ని ప్రాణాలు పోక ముందే ఉద్యోగుల్ని కాపాడుకోవాలన్న ఒత్తిడి వారిపై వస్తోంది.