ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుల్ని ఊరకనే పెట్టుకోలేదు. ఆ విషయం అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి ఓ సలహాదారు గట్టెక్కించిన వైనంతో బయటపడిందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టకపోవడంతో ఏపీకి వచ్చిన ఆర్ఈసీ, పీఎఫ్సీ కార్పొరేషన్ల చైర్మన్లకు ఏపీ ప్రభుత్వ సలహాదారు రజనీష్ కుమార్ నుంచి భరోసా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన మాజీ ఎస్బీఐ చైర్మన్. పదవి విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు.
ఆయన ఏపీకి ఎప్పుడైనా వచ్చారో లేదో తెలియదు కానీ .. ఇప్పుడు అత్యవసరంగా రుణాల కిస్తీల చెల్లింపుల కోసం ఏర్పడిన లోటులో ఆయన ఎస్బీఐతో మాట్లాడి ప్రభుత్వాన్ని రెండున్నర వేల కోట్ల రుణాలను సర్దుబాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఇచ్చిన హామీ మేరకు కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్ొరేషన్ చైర్మన్లు సంతృప్తిగా తిరిగి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రెండురోజుల్లో కిస్తీలు కట్టేస్తామని భరోసా ఎస్బీఐ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ గండం గడిచిపోవడంతో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా రిలీఫ్ ఫీలయ్యారు. నిజానికి ఆర్ఈసీ, పీఎఫ్సీ కార్పొరేషన్ల చైర్మన్ల షెడ్యూల్లో సీఎంతో భేటీ లేదు.
కానీ పై నుంచి క్లారిటీ రావడంతో సీఎంతో భేటీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తిరిగి చెల్లింపులపై కాస్త క్లారిటీ రావడంతో వారు వెళ్లిపోయారు. అయితే ఎక్కడా వారిని మీడియాతో మాట్లాడనీయలేదు ప్రభుత్వం. చివరికి క్యాంప్ కార్యాలయంలో రికార్డుచేసినా ఓ వీడియోను మాత్రం మీడియాకు పంపించారు. అందులో అప్పుల కోసం అన్నట్లుగా కాకుండా కొత్త అప్పులు ఇవ్వడానికి వచ్చినట్లుగా పరోక్షంగా చెప్పడం విశేషం.