మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు “దూరంగా..దగ్గరగా.. ” వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని ప్రకటిస్తున్న ఆయన.. తరచూ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూంటారు. దానికి కారణం ఆయన వెల్లడించే సర్వేలు ఖచ్చితత్వానికి మారుపేరుగా ఉండటమే కాదు.. ఆయన చేసే ప్రకటనలు కూడా.. తీసి పారేయలేని విధంగా ఉంటాయి. ఆయన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తే… మీడియా నుంచి దూసుకొచ్చే ప్రశ్నలన్నీ.. రాజకీయాలపైనా.. సర్వేలపైనా… ప్రజల మూడ్ ఎలా ఉందన్నదానిపైనే ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వచ్చిన లగడపాటికి మీడియా నుంచి ఇవే ప్రశ్నలు దూసుకొచ్చాయి. అప్పుడు లగడపాటి చెప్పీ.. చెప్పనట్లుగా.. ఏపీలో రాజకీయ పరిస్థితిని విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా ఓ సెంటిమెంట్‌గా మారిందని లగడపాటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే.. పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తాయన్న భావన… ప్రజల్లో బలంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సామాన్య ప్రజలు ఎప్పుడూ తమ అభిప్రాయాలను మాటలతో చెప్పరని.. ఓట్లతో.. బ్యాలెట్ బాక్సుల్లో చూపిస్తారన్నారు. రాష్ట్రాన్ని విభజించినందున.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహాన్ని… ఓట్లు రూపంలో ఎలా చూపించారో.. 2014లో చూశామని లగడపాటి గుర్తు చేశారు. లగడపాటి అభిప్రాయం చూస్తే.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేకహోదా అంశమే.. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారుతుందని.. తేల్చేసినట్లు భావింవచ్చు. కొద్ది రోజుల క్రితం.. ఆంధ్రజ్యోతి దినపత్రిక కోసం.. లగడపాటికి సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఓ సర్వే చేసింది. అందులో టీడీపీకి ఎడ్జ్ ఉందని ఫలితం వచ్చింది. అయితే దీనిపై లగడపాటి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అనంతపురంలోనూ ఆయన సర్వేలపై ఏం మాట్లాడలేదు. కానీ ఎన్నికలకు ముందు తన సర్వేను కచ్చితంగా ప్రకటిస్తానన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున.. ఇప్పుడు తన సర్వేను ప్రకటించినా.. ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రం విడిపోతే.. రాజకీయ సన్యాసం చేస్తానని లగడపాటి సవాల్ చేసి… ఆచరణలో చూపించారు. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయాలపై అంతులేని ఆసక్తి ఉన్న ఆయన దూరంగా ఉండలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు. కొంత కాలం క్రితం వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని చెబుతూ వచ్చారు. ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను అని చెబుతున్నారు. కానీ కొద్ది రోజులుగా.. టీడీపీ అధినేత చంద్రబాబును తరచుగా కలుస్తున్నారు. ఆ భేటీల ఎజెండా ఏమిటో బయటకు రాలేదు కానీ… సమావేశం అయినప్పుడల్లా.. రాజగోపాల్ టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి మళ్లీ రావాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ ఆహ్వానించినా నిరాకరించారట.