ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ పేరు ఎప్పుడైనా విన్నారా ?. విని ఉండరు.. చదివి ఉంటారు.. ఎప్పుడంటే ఇప్పుడే. ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఎక్కడుందో.. ఏం చేస్తుందో తెలియదు కానీ.. కొత్తగా దానికో క్రియేటివ్ హెడ్‌ను నియమించేశారు సీఎం జగన్. ఆయనెవరో కాదు.. టీవీ ఆర్టిస్టు జోగినాయుడు. అవకాశాల్లేక వైసీపీకి సపోర్టుగా స్కిట్లు చేసుకుంటున్న ఈయనను గుర్తించి.. ఈ కొత్త క్రియేటివిటీ డిపార్టుమెంట్ ఎక్కడ ఉందో వెదికి మరీ క్రియేటివ్ హెడ్‌ని చేసేశారు.
అసలు విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ .. పూర్తి ప్రచార ఖర్చులన్నీ ప్రజల మీదే మోపాలని నిర్ణియంచుకుంది. తమ పార్టీ కోసం చేసే ప్రచార చిత్రాలు.. ఇతర పనుల కోసం నియమించుకుంటున్న వారందరికీ.. ఇలా రకరకాల పదవులు ఇస్తోంది. ఇటీవలి కాలంలో నియేమితులవుతున్న వారంతా ఈ కోణంలోనే అపాయింట్మెంట్లు పొందుతున్నారని వారందరికీ ఊహించనంతగా లక్షల్లో జీతాలిస్తున్నరన్న ప్రచారం జరుగుతోంది. ముందు ముందు ఇలాంటి నియామకాలు ఇంకా చాలా ఉంటాయని చెబుతున్నారు.
వేల కోట్ల అప్పులు చేస్తూ.. సరిగ్గా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం.. తమ ప్రచారం.. పార్టీ ప్రచారం కోసం మాత్రం ప్రజాధనాన్ని విస్తృతంగా ఖర్చు చేస్తున్నారు. అడ్డు అదుపూ లేకుండా సలహాదారుల్ని నియమించుకున్నారు. సొంత పత్రిక సాక్షిలో పనిచేసే సగం మందికి ఔట్ సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ జీతాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా ఎవరేమనుకుంటే మాకేందిలే అన్నట్లుగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని అలా అడ్డగోలు నియామకాల ద్వారా ఖర్చు చేసేస్తూనే ఉన్నారు.