2004 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఓటమి చవిచూసినందుకు, రాష్ట్ర ఉద్యోగుల్లో చాలామంది సంతోషపడ్డారు. పీడ విరగడైందనుకున్నారు. ఆర్టీసీ ఉద్యుగులుసహా అన్ని విభాగాల్లోని ఉద్యోగులు ఆరోజు దీపావళి వచ్చినట్లు సంబరపడ్డారు. అప్పటిదాకా చంద్రబాబు ఏపీ ఉద్యోగులను పీడించుకు తిన్నాడనీ, జన్మభూమి, వీడియో కాన్ఫరెన్సులంటూ బెత్తం పుచ్చుకున్న హెడ్ మాస్టర్లా చంద్రబాబు వ్యవహరించేవారని చెప్పుకున్నారు.
ఏపీ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లు గెలుపుఒటమిలను బలంగా నిర్దేశించే స్థాయిలో ఉండకపోయినప్పటికీ, గెలుపును నిర్దారించే ఒకానొక ఫ్యాక్టర్ గా మాత్రం ఉంటున్నదన్నది నిజం. రైతులను పట్టించుకోకపోవడం, విద్యుత్ ఛార్జీలమోత, హైటెక్ విధానాలతో పాటు ఉద్యోగుల్లో అసమ్మతికూడా తోడైంది. వెరసి 2004లో చంద్రబాబు తన పార్టీని గెలిపించుకోలేకపోయారు.
2009లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుపై ఉన్న అసంతృప్తి మేఘాలు తొలగిపోలేదు. అలాగే, వైఎస్ రాజశేఖరరెడ్డిపై భ్రమలు వీగిపోలేదు. ఏపీ ఉద్యోగులు వైఎస్ తరహా పాలనకు అలవాటుపడిపోయారు. ఉద్యోగుల ఇళ్లలో వైఎస్సార్ ఫోటో కనిపించే స్థాయికి ఫేవరిజం బయటపడింది. ఫలితంగా అప్పటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గద్దెనెక్కించలేకపోయారు.
2014కు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగానే మారిపోయింది. సమైక్య రాష్ట్రం రెండుముక్కలుగా విడిపోయింది. ఆంధ్రులు తాము కోరుకోకపోయినప్పటికీ వారికంటూ రాజధానిలేని రాష్ట్రం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ నుంచి తమను వెళ్లగొట్టేశారన్న భావన ఆంధ్రుల్లో అధికమైంది. ఎలాగైనాసరే తమ సత్తా చూపించాలనుకున్నారు. హైదరాబాద్ ని తలదన్నేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం చేయాలనుకున్నారు. తెలంగాణకు మించిపోయేలా ఆంధ్రప్రదేశ్ ను సిద్ధంచేయాలంటే అది మహాయజ్ఞమని అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎలాంటి నాయకుడు తమను పరిపాలించాలన్న విషయంలో ఆంధ్రులు బేరీజు వేసుకున్నారు. అప్పటికే మొలలోతు స్కాములతో మునిగిపోయి ఉన్న జగన్ కంటే కష్టపడే స్వభావం, గతంలో హైదరాబాద్ ని హైటెక్ సిటీగా మార్చిన అనుభవం ఉన్న చంద్రబాబే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు సరైన నేతగా ప్రజల్లో హెచ్చుశాతం మంది భావించారు. అందుకే 2014 ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. 2004 ఎన్నికలప్పుడు చంద్రబాబు రాకూడదనుకున్న ఏపీ ఉద్యోగులే 2014 వచ్చేసరికి ఆంధ్రా సెంటిమెంట్ తో గతంలో తాము పడ్డ ఇబ్బందులను మరిచిపోయి చంద్రబాబును స్వాగతించారు. ఆయనొక్కడే ఆంధ్రుల పరువుకాపాడగలరని విశ్వసించారు. ఉద్యమస్ఫూర్తితో బాబుకు అండగా నిలిచారు.
ఇంతవరకు కథ బాగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై పనిఒత్తిడి తీవ్రస్థాయిలో పెంచుతాడన్న భయం ఉద్యోగవర్గాల్లో ఇప్పుడు మొదలైంది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు వచ్చే జనవరి నుంచి ప్రజాసంక్షేమంగా జన్మభూమి వంటి కార్యక్రమాలను పునఃప్రారంభించాలనుకుంటున్నారు. దీనికితోడు రాజధాని నిర్మాణపు పనులు జనవరి నుంచి ముమ్మరమవుతున్నాయి. జులై నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే పాలన సాగించేందుకు బాబు చకచకా పావులుకదుపుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులను రాష్ట్ర రాజధానిప్రాంతానికి రప్పించేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్నట్టుండి మారిన పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగుల్లో అసంతృప్తి చాపక్రిందనీరులా పాకిపోతున్నది. అందుకే చంద్రబాబు పాలన మళ్ళీ తమకు గ్రహణస్థితిని కల్పిస్తుందేమోనన్న భయం ఏపీ ఉద్యోగుల్లో కనబడుతోంది.
పనిఒత్తిడి పెంచితే గ్రహణం పట్టినట్లు ఉద్యోగులు భావించడాన్ని చంద్రబాబు కూడా గ్రహించకపోలేదు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, నూతన రాజధాని నిర్మించి ప్రజల మన్ననలు పొందడం బాబుముందుతున్న తక్షణ కర్తవ్యం. ఈ విషయంలో రాజీపడకుండానే మరో పక్క ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పనులు సత్వరంగా రాబట్టేందుకు బాబు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలోలాగా కాకుండా అంటే, బెత్తం పుచ్చుకుని బెదరించే హెడ్ మాస్టర్ లాగా కాకుండా కర్తవ్యం బోధించే గురువుగా ఉద్యోగులు తనను భావించాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఉద్యోగుల పూర్తి సపోర్ట్ లేకుండా చంద్రబాబు తానొక్కడే నవ్య రాజధానిని నిర్మించలేరు. అందుకే, ఉద్యోగులను నొప్పించకుండా వారి నుంచి పనిని రాబట్టాలన్నది ఆయన ఆలోచన. ఆకర్షణీయ పథకాలతోనూ, పోటీతత్వం పెంచడంతోనూ ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపాలని చూస్తున్నారు. ఇదంతా నిజమైతే బాబు అప్పగించే పనులవల్ల తమకు కష్టకాలం దాపురించిందన్న భావన ఉద్యోగుల్లో తొలిగిపోవచ్చు. అప్పుడు వారికి గ్రహణకాల చంద్రుడుకాకుండా, కార్తీక పౌర్ణమి వెలుగులు నింపే చంద్రుడే కనిపిస్తాడు. అలా జరగాలనే ఆశిద్దాం.
– కణ్వస