ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో యాభైవేల ఎకరాల అటవీభూములను డీనోటిఫై చేసే విషయమై మరో 15 రోజుల్లో నిర్ణయాన్ని తెలియజేయగలమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శనివారం నాడు రాష్ట్రప్రభుత్వానికి తెలియజేసింది. రాజధాని నిర్మాణానికి (ఇపుడున్న 33 వేల ఎకరాల భూమికీ అదనంగా)50 వేల ఎకరాల అటవీ భూములు అవసరమని 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.రాజధాని ప్రాంతంలో భూములను వాణిజ్యపరంగా విక్రయించే వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో అధికారికంగానే అతిభారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసే తొలి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవుతుంది.
రాజధాని ప్రాంతంలో లేఅవుట్ ప్లానింగ్ పూర్తి చేశాక, భూముల కేటాయింపులు అమ్మకాలూ ఉంటాయి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా భూములను కేటాయిస్తారు. రాయితీల పాలసీ ఇక్కడ భూములు కొనే కంపెనీలకు వర్తిస్తుంది. రైతులకు ఇస్తామన్న భూములు వారికి కేటాయించాక, మిగులు భూముల్లో ఈ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి ఇప్పటికే వివరించారు. సమీకరించిన భూమిలో మిగిలే భూమితో పాటు, అటవీ భూములు డీనోటిఫికేషన్ ద్వారా వచ్చే మరో 50 వేల ఎకరాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేయనున్నారు. భూ విక్రయంతో లాభాలు ఆర్జించి సుందరమైన రాజధాని నగరాన్ని నిర్మిండమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంది.
రాజధానికి తీసుకున్న భూములను అభివృద్ధి చేశాక ఆ ప్రాంతాన్ని జోన్లుగా విభజిస్తారు. ఆర్థిక, పర్యాటక, ఐటి, వినోద, వ్యాణిజ్యం మొదలైన రంగాల వారీగా ఈ జోన్లు వుంటాయి. ఆయా జోన్లలో పెట్టుబటులను టెండర్లు పిలిచి ఖరారు చేస్తారు. కంపెనీలకు జోన్ల వారీగా భూములు కేటాయించి నిర్వహణ కూడా ఆయా కంపెనీలకే అప్పజెప్పనున్నారు. షరతులకు లోబడి భూములు తీసుకున్నాక వారు వేరే వ్యక్తులకు కేటాయించినా తమకు ఇబ్బంది లేదని సింఎం చెబుతున్నారు. లాభాలు వచ్చే వీలుందనుకుంటే ప్రభుత్వమే కన్సార్టియంగా మారి ఆయా లావాదేవీల్లో భాగం పంచుకుంటుంది. న్యాయపరంగా చిక్కులు రాకుండా ఈ మేరకు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చట్టంలోనూ మార్పులూ తీసుకురానున్నారు. ప్రస్తుత ప్లానులో కంపెనీలకు వీలుగా ఎప్పుడు ఎక్కడ మార్పులు చేయాలనుకుంటే అక్కడ చేస్తారు.
ఇదంతా విశ్లేషించుకుంటే రాజధానిలో భాగస్వాములమవుతామని, ఉపాధి లభిస్తుందని ఆశపడి లాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతుల ఆశలు ఎప్పటికీ నెరవేరవని స్పష్టమైపోతుంది. నిరంతరం కొససాగే ఇన్ క్లూజివ్ డెవలప్ మెంటులో మూల వనరులు ఇచ్చిన వారికి భాగస్వామ్యం అనే ఆదర్శం ఆచరణలోకి రాదని రాష్ట్రప్రభుత్వ ఆలోచనలే తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి వాణిజ్య సరళిలో షరతులు లేకుండా భూములుకొనే కంపెనీల మధ్యలో రైతులు తమకు కేటాయించే వెయ్యేసి గజాల స్ధలాల్ని నిలుపుకోగలరా? పక్కన వున్న కంపెనీ ఇచ్చేధరకు కాకుండా పోటీ పెట్టి కాస్త పెద్ద ధర రాబట్టుకుందామంటే మరో కంపెనీ ముందుకి వస్తుందా?? అసలు ఇది ప్రజా రాజధానే అవుతుందా???