రాష్ట్ర విభజన కారణంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల నష్టపోవడమే కాకుండా, ఆ తరువాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కుదిరేవరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కత్తులు దూసుకోవడం వలన ఆంధ్రాలో ఒకరకమయిన అశాంతి నెలకొని ఉండేది. అదే సమయంలో ఓటుకి నోటు కేసుతో తెదేపా పునాదులు దాదాపు కదిలిపోయాయి. మధ్యలో హూద్ హూద్ తుఫాను వంటివి ఏవో ఒకటి రాష్ట్రాన్ని పలకరించి పోతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వోద్యోగులు పంతం పట్టి జీతాలు పెంచుకొన్నారు. వీటన్నిటికీ తోడూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంట రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాలతో నిత్యం ప్రభుత్వానికి అగ్నిపరీక్షలు పెడుతూనే ఉన్నారు.
మింగ మెతుకు లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె తప్పదన్నట్లు అట్టహాసంగా గోదావరి పుష్కరాలు, అమరావతి శంఖుస్థాపన, తాత్కాలిక సచివాలయ నిర్మాణం వంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకంజవేయడం లేదు. బహుశః రాష్ట్ర ప్రభుత్వం ప్రదరిస్తున్న ఈ జోరు చూసేనేమో సుమారు ఏడాదిన్నర కావస్తున్నా కేంద్రప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనీసం ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేయలేదు.
ఇటువంటి తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి స్థిరంగా అభివృద్ధి చెందుతుండటం గమనార్హం. ఈ ఏడాదిన్నర కాలంలో శ్రీ సిటీ, కృష్ణపట్నం, విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతాలలో కొత్తగా అనేక పరిశ్రమలు వచ్చేయి. ఇంకా చాలా రాబోతున్నాయి. అందుకు ప్రధాన కారణం తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిబ్బరంగా, నిలకడగా ముందుకు సాగుతుండటమేనని చెప్పవచ్చును. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ప్రభుత్వాన్ని అభినందించవలసిందే.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండటం, అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తుండటం మరో కారణంగా చెప్పుకోవచ్చును.
రాజధాని విషయంలో కూడా ఎన్ని అవరోధాలు ఎదురయినప్పటికీ వాటన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొంటూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. అక్కడ పనులు మొదలయినట్లయితే, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు, ఐటి సంస్థలు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా పెరుగుతాయి. 2014 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింగపూర్ వంటి రాజధాని నిర్మించి చూపుతానని చంద్రబాబు నాయుడు పదేపదే ప్రజలకు హామీ ఇచ్చేరు. ఆ తరువాత కూడా చాలాసార్లు వచ్చే ఎన్నికల నాటికి రాజధాని మొదటిదశ నిర్మాణం పూర్తి చేస్తానని పదేపదే చెప్పేవారు. కానీ ఇప్పుడు అంత నమ్మకంగా చెప్పడం లేదు. అందుకు ఆర్ధిక ప్రతిబంధకాలే కారణమని భావించవచ్చును. కానీ ఈ విషయంలో ఆయన విఫలమయినట్లయితే వచ్చే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలపై తప్పకుండా ప్రభావం పడుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటే బీజేపీ కూడా నష్టపోవచ్చును. కనుక రెండు పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజధాని మొదటిదశ నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పటి నుండే గట్టిగా కృషి చేయడం మంచిది.