ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం కొత్తగా ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే… అక్కడి సెటప్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. అదేదో కోర్టు అయినట్లుగా తమేదో తప్పు చేశామని శిక్షించడానికి తీసుకొచ్చినట్లుగా అక్కడి సీన్ ఉంటుంది. నిజానికి వారు ఆస్తులు అమ్మడమో.. లేదా కొనడమో చేస్తున్నారు. రెండు పార్టీలు అక్కడ ఉంటాయి. వారు ప్రభుత్వానికి లక్షలు ఫీజు కడతారు. మరి అలాంటప్పుడు ఈ రాచరిక ఏర్పాట్లు ఎందుకన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది.
అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆ సెటప్ ఎందుకని.. చెప్పి తీసేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక నుంచి సాధారణ రీతిలోనే సబ్ రిజిస్ట్రార్లు కూడా వ్యవహరించాలి. ప్రభుత్వానికి పన్ను చెల్లింపు దారులు కాబట్టి వారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆయన ఆదేశాలు మొత్తం మార్చేశారు. ఎత్తైనా కుర్చీలు.. రిజిస్ట్రార్ ఏదో పై నుంచి దిగి వచ్చిన వ్యక్తిలా కాకుండా సాధారణంగా ట్రీట్ చేయనున్నారు. ఈ మార్పులు ప్రజల్ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అసలు రిజిస్ట్రార్ ఆఫీసులలో ఆ వాతావరణాన్ని ఎలా తీసుకు వచ్చారన్నది చాలా మందికి తెలియదు. కానీ అది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉంది. ఉంది కదా అని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రాను రాను.. పన్నులు కట్టేది మేము కదా.. రాచరిక వ్యవస్థ తరహాలో.. తమను నించోబెట్టి పనులు చేయడమేమిటని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరి ఫీడ్ బ్యాక్ తెలుసుకున్న ప్రభుత్వం మార్పు చేర్పులు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని టాక్స్ పేయర్స్ ఫ్రెండ్లీగా మార్చేసింది.