మార్కెట్ బారోయింగ్ పద్దు కింద ఆంధ్రప్రదేశ్ ఖజానాలో బుధవారం 1500 కోట్లరూపాయలు జమ అయినట్టు తెలిసింది. ఫలితంగా 770 కోట్లరూపాయల వేస్ అండ్ మీన్స్, 100 కోట్లరూపాయల ఓవర్ డ్రాఫ్ట్ తీరిపోగా 600 కోట్లరూపాయల మిగులు వుంది. నాలుగైదు పెద్ద బిల్లులు చెల్లిస్తే ఖజానా మళ్ళీ ఖాళీ అయిపోతుంది. పాతఅప్పుల్ని తీర్చడానికి కొత్త అప్పుల్ని, చిన్న బాకీల్ని చెలించడానికి పెద్ద రుణాల్ని చేస్తున్న రాష్ట్రప్రభుత్వం తక్కువ వడ్డీకి అప్పు దొరికే మార్గాలు వెతకడంలో సీనియర్ అధికారులు నిమగ్నమై వున్నారు. ఓవర్డ్రాఫ్ట్ మీద 8.75 శాతం వడ్డీ, మార్కెట్ బారోయింగ్ మీద 7.98 శాతం వడ్డీ చెల్లిరచాలి. ఓవర్డ్రాఫ్ట్ వడ్డీ బరువును కాస్తయినా తగ్గించుకోడానికే మార్కెట్ బారోయింగ్ కి వెళ్ళారు.
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ (జిఎస్డిపి) లో మూడుశాతం వరకూ మార్కెట్ బారోయింగ్ రుణం పొందవచ్చు. ఈ సదుపాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు 14300 కోట్ల రూపాయలు అప్పు దొరుకుతుంది. అయితే గరిష్టంగా మూడేసి నెలలకు ఒకసారి 3500 కోట్ల రూపాయల చొప్పున మాత్రమే ఏడాదిలో నాలుగు సార్లు ఈ లోన్ తీసుకోవచ్చు. మార్కెట్ బారోయింగ్స్ లో జిఎస్డిపి నుంచి తీసుకోగలిగిన 3 శాతం రుణపరిమితిని 3.5 శాతానికి పెంచాలని కొంత కాలం క్రితమే తెలంగాణా ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరబోతున్నారు. మూడునెలలకు కాలపరిమితిని, నగదు పరిమితిని తొలగించి ఎప్పుడు కావాలంటే అప్పుడు రుణం తీసుకునేలా సడలింపు ఇవ్వాలని కూడా కోరాలని ఆలోచిస్తున్నారు.
గత పదేళ్లలో లక్షా 26వేల కోట్ల రుణాన్ని మార్కెట్ బారోయింగ్స్ ద్వారా పొందింది ఉమ్మడి రాష్ట్రం. ఇందులో నవ్యాంధ్ర వాటా 73వేల 856 కోట్ల రూపాయలు.తెలంగాణ వాటా 52వేల 783కోట్ల రూపాయలుగా ఉంది.. రాష్ట్ర విడిపోయాక మళ్లీ 10 వేల కోట్లు రుణం పొందింది ఏపీ ప్రభుత్వం.. దీంతో అప్పు 82వేల కోట్లకు చేరింది.. ఆర్ బి ఐ లెక్కలప్రకారం ప్రతి వెయ్యి కోట్ల అప్పుకు పదేళ్లలో 800కోట్లు వడ్డీగా కట్టాలి.. ఈ లెక్కల ప్రకారం ఏపీ తీసుకున్న 82వేల కోట్లకు పదేళ్లలో 64వేల కోట్లు వడ్డీ అవుతుంది… అసలు వడ్డీ కలిపి మొత్తం 146వేల కోట్లకు చేరనుంది..