తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడుని నియమించడానికి రంగం సిద్ధమయింది. అధికార పార్టీపై ఏ మాత్రం బెరుకు లేకుండా విరుచుకుపడే సామర్థ్యం.. విషయ పరిజ్ఞానం.. రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉన్న నాయకుడు కావడంతో.. చంద్రబాబునాయుడు… అచ్చెన్నాయుడు వైపు మొగ్గుచూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. ప్రస్తుతం టీడీపీ అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. మండల స్థాయి వరకూ పూర్తయ్యాయి. త్వరలో జిల్లా కమిటీలు పూర్తి చేస్తారు. ఈలోపుగానే అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్లలో అత్యధికారులు అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచనకు మద్దతిస్తున్నారు. వాస్తవానికి ఈ పదవికి మొదట .. రామ్మోహన్ నాయుడు పేరు ప్రచారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని క్రమంగా యువత చేతుల్లోకి పంపాలనే ఆలోచనలో భాగంగా… యువకుడైన రామ్మోహన్నాయుడుకు చాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. రామ్మోహన్ నాయుడు.. రాజకీయాలకు అనూహ్యంగా వచ్చినా… మంచి అవగాహనతో… చక్కని వాక్చాతుర్యంతో రాజకీయం చేస్తున్నారు. అయితే.. ఆయనకు మరీ అనుభవం తక్కువ అవుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఇంకా రామ్మోహన్ నాయుడు 30ల ప్రారంభంలోనే ఉన్నారని… కాస్త రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం పెంచిన తరవాత పెద్ద బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయితే.. ఇప్పటి వరకూ.. ఉన్న పరిస్థితి మారిపోతుంది. ఇప్పటి వరకూ… అధ్యక్ష హోదాలో చంద్రబాబు మాత్రమే.. వైసీపీపై ఎటాక్ చేసేవారు. ఇప్పుడు.. అచ్చెన్నాయుడు కూడా తెరమీదకు వస్తే .. పాలనా వైఫల్యాల్ని మరింత ఎక్కువగా .. ప్రభావితంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి అచ్చెన్నాయుడు విషయంలో వైసీపీ ఎప్పుడూ ప్రత్యేకమైన టార్గెట్గా పెట్టుకుంటూ ఉంటుంది. అసెంబ్లీలో ఆయనను నిలువరించడానికి వ్యక్తిగత విమర్శలు.. బాడి షేమింగ్ చేస్తుంది. చివరికి ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి ఈఎస్ఐ స్కాంలో కూడా.. పేరు చేర్చింది. ఇవన్నీ అచ్చెన్నాయుడుని మరింత బలంగా తీర్చిదిద్దాయని టీడీప నేతలు అంటున్నారు.