ఇది కంటికి కనిపిస్తున్న నిజం. దాదాపు మూడేళ్ళుగా టిడిపి అనుకూల మీడియా అంతా కూడా ఈ నిజాన్ని దాచిపెట్టాలని….నింద ప్రతిపక్షంపైన వేయాలని తాపత్రయపడుతూ ఉంది కానీ తప్పులన్నీ మాత్రం టిడిపివైపునే ఉన్నాయి. ఈ సమావేశాల్లో అది ఇంకా చాలా స్పష్టంగా కనిపించింది. అసలు శాసనసభా సమావేశాలు జరపడమే టిడిపికి ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా తక్కువ రోజులు సభ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అధికారపార్టీ సభను నిర్వహిస్తున్న తీరు కూడా అస్సలు బాగాలేదు. ప్రతిపక్ష పార్టీని దోషిగా జనం ముందు నిలబెట్టాలన్న ప్రయత్నం తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. గత రెండు రోజులుగా మీడియా పాయింట్ దగ్గర టిడిపి మహిళా ఎమ్మెల్యేలు ప్రవర్తన అయితే గొడవకు వచ్చినట్టుగానే ఉంటోంది. ఇక సభలో కూడా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం టిడిపి ఎమ్మెల్యేలు నానా పాట్లూ పడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగేలా రెచ్చగొడుతున్నారు. టాపిక్ ఏదైనా సరే వైఎస్ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. ఆ తర్వాత వైకాపా జనాలు ఆందోళన చేయడం….సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోవడం అంతా రొటీన్ వ్యవహారం అయిపోతోంది.
నిజానికి 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ చంద్రబాబు చేస్తున్న తప్పులు అన్నీ ఇన్నీ కావు. అలవికాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బడ్జెట్ లెక్కల్లో అన్నీ మాయలే చేయాల్సిన పరిస్థితి. ఆ లెక్కల గురించి మాట్లాడితే బొక్కలన్నీ బయటపడే పరిస్థితి. అందుకే సభ సజావుగా జరగడం టిడిపికి అస్సలు ఇష్టం లేదు. బడ్జెట్‌లోనేమో భారీ కేటాయింపులు చూపిస్తారు. ఖర్చు మాత్రం అందులో సగం కూడా ఉండడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ని కూడా చంద్రబాబే తన చేతుల్లోకి తీసుకున్నాడన్నది వాస్తవం. ఆ వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేసి కేంద్రప్రభుత్వమే తన సమర్థతను గుర్తించి తనకు అప్పగించింది అని ఆయనే డప్పుకొట్టుకోవడం ప్రజల దృష్టిలో చులకన అయ్యే వ్యవహారమే. ఇక ఆంధ్రప్రదేశ్ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. తాను ఇఛ్చిన హామీలు నెరవేర్చానని జనాలను నమ్మించాల్సిన దుస్థితి చంద్రబాబుది. జరగని వాటిని జరిగినట్టుగా భ్రమింపచేయాలి. ఇక తాను దూర సందులేదు మెడకో డోలు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎపికి ఏమీ చేయడం లేదు అన్న వాస్తవాన్ని కూడా దాచిపెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబుది. ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, రైల్వే జోన్, పోలవరంలాంటి విషయాల్లో చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అన్నీ ఇన్నీకావు. మరి ఈ లొసుగులన్నీ బయటపడకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సజావుగా జరగకూడదు. అలా జరగాలంటే వైఎస్‌లను వ్యక్తిగతంగా దూషించాలి. రెచ్చగొట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న తతంగం అదే. అయితే టిడిపి వాళ్ళ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలో మాత్రం జగన్‌కి తెలియడం లేదు. జగన్ అనుభవలేమిని మాత్రం చంద్రబాబు బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. కానీ జగన్‌పైన గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను గెలిచినట్టు కాదుగా. ప్రజల మనసుల్లో చంద్రబాబు పట్ల వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని అత్యంత అనుభవజ్ఙుడైన చంద్రబాబులాంటి నాయకుడు గుర్తించకపోతే ఎలా? అబద్ధపు ప్రచారంతో జనాలను మోసం చేయాలనుకుంటే మాత్రం గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సాధారణ ఎన్నికల్లోనూ రావన్న గ్యారెంటీ అయితే అస్సలు లేదు.