బిహార్ ఈ ఉప ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినందుకు కాంగ్రెస్, బీజేపీని వ్యతిరేకించేవారు ‘మిటాయిలు పంచుకొని పండగ చేసుకోవడం’ పెద్ద ఆశ్చర్యకరమయిన విషయమేమీ కాదు. కానీ మిత్రపక్షమయిన తెదేపా పైకి విచారం నటిస్తున్నప్పటికీ లోలోన అందుకు చాలా సంతోషిస్తుండటమే విశేషం. బీజేపీ ఓటమిపై ఏపీలో తెదేపా నేతలు ఎవరూ ఇంకా స్పందించలేదు. స్పందించిన వారు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.
ఇంతకాలం దేశంలో ఎదురులేకుండా సాగిపోతున్న బీజేపీని చూసి తెదేపా దానికి అణిగిమణిగి ఉండాల్సివచ్చేది. మోడీ దయాదాక్షిణ్యాలపైనే రాష్ట్రాభివృద్ధి ఆధారపడి ఉందనే భావం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరిలో నెలకొని ఉండేది. బీజేపీ ఓటమిని వారు కాక్షించనప్పటికీ, ఇంతకాలం ఎదురే లేకుండా సాగుతున్న మోడీకి బిహార్ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో, ఇకనయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరిలో మార్పు రావచ్చని తెదేపా నేతలు ఆశిస్తే అందులో అసహజమేమీ లేదు. ఈ ఓటమి కారణంగా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఇకనయినా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇంతకాలంగా తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న రాష్ర్ట బీజేపీ నేతలు బిహార్ లో తమ పార్టీ ఘోర పరాజయం పొందిన కారణంగా తాత్కాలికంగానయినా వాళ్ళందరి నోళ్ళు మూతపడుతాయని తెదేపా నేతలు భావిస్తున్నారు. మోడీ దూకుడుకి, రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ ఓటమి కళ్ళెం వస్తుందని తెదేపా నేతలు ఆశిస్తున్నారు. బహుశః అందుకే వారు మనసులో బీజేపీ ఓటమిని ఆనందిస్తున్నరేమో?